"ఉత్తిష్ఠత, జాగృత!"
ఫిబ్రవరి 2013 వన్నెకులజ్యోతి "జాగృతి” అను వ్యాసంలో పల్లవరత్న శ్రీ రేకాడి సముద్రరావుగారు అక్షరసత్యాలు వెల్లడించారు. అందులోని ఒక్కోమాట నిద్రాణమై ఉన్న అగ్నికుల క్షత్రియులకు ఒక్కో అంకుశం పోటు.
అగ్నికులక్షత్రియ (అ.క్ష) కులము ఇంత హీన, దీన స్థితికి దిగజారి, సమాజంలో చిన్నచూపుకు గురవుతూ, కులానికి చెందిన ఉద్యోగులు కులాన్ని దాచుకొని సమాజంలో మర్యాదగా బ్రతకడానికి ప్రయత్నించే పరిస్థితులు కలగటానికి గల కారణములు అన్వేషించి వాటి నిర్మూలనకు తగిన కృషిచేయాలి.
ఈ సందర్భంగా నాకు ఉన్న అభిప్రాయాలు కొన్ని :
1. అ.క్ష. కులం కుల వృత్తి ఆధారంగా ఏర్పడిన ఆదివాసి కులాల్లో ఒక కులం కాదు. కుల విభజనకు ఆధారమైన మనుస్మృతి 10అ. 48శ్లోకం ప్రకారం "మత్స్యఘాతో నిషాదానాం..... చేపలుపట్టే వృత్తి నిషాదులది”. మనము అ.క్ష.లమని అందులోనూ పల్లవులమని చెప్పుకుంటూ చేపలు వేట మన కులవృత్తి అని చెప్పుకోవటం ఎంతవరకు సబబో ఆలోచించవలసిన విషయము.
అతి ప్రాచీన కాలమునుండి వస్తున్న అసలుసిసలైన ఆదివాసి మత్స్యకారులు వేరు, క్రీస్తుకు పూర్వము 2 లేక 3 వందల సంవత్సములకు పూర్వము భారతదేశంలో సగభాగం పరిపాలించిన శాతవాహనులు బలహీనమైన పరిస్థితులలో దేశరక్షణకొరకు ఏర్పరచబడిన అ.క్ష. కులము వేరు. (చూడు. శ్రీకోట వెంకటాచలం గారి "అగ్నికుల క్షత్రియులు లేక బ్రహ్మక్షత్రులు”). దేశీయచరిత్రకారుల ప్రకారము అ.క్ష.లలో అనేక రాజవంశముల వారున్నారు. ప్రస్తుతము ఉత్తరభారతదేశంలోని పవార్ లు, చౌహాన్ లు, సోళంకులు మొ||క్షత్రియ జాతులవారు అ.క్ష.లని, కనౌజ్ పరిసర ప్రాంతాలనేలిన పరిహారులు కూడా అ.క్ష.లేనని చరిత్ర స్పష్టంగా చెప్తున్నది. (చూడు. శ్రీకోట వెంకటాచలం గారి "అగ్నికుల క్షత్రియులు లేక బ్రహ్మక్షత్రులు”) అదేవిధంగా దక్షిణాన శాతవాహనులకు సామంతులుగా వ్యవహరించిన పల్లవులు స్వతంత్రులై క్రీ.శ.200 నుండి క్రీ.శ.700 వరకు కాంచీపురం రాజధానిగా ఏర్పరుచుకొని సాలంకాయనులు, బృహత్పలాయనులు, విష్ణుకుండినులు మొ|| రాజవంశములను సామంతరాజులుగా చేసుకొని కళింగ వేశ సరిహద్దుల వరకు ఆంధ్ర దేశాన్ని పరిపాలించారని, ఆ తర్వాత కూడా కాంచీపురం రాజధానిగానే దక్షిణాన తమిళ దేశాన్ని పాలించారని చరిత్ర ఉంది. (చూడు. భావరాజు వేంకట కృష్ణారావుగారి "ప్రాచీనాంధ్ర నౌకాజీవనము")
ఆంధ్రదేశములో పల్లవ వంశము పాలించిన కాలంలో వారు జీవనాధారంగా చేపట్టిన వ్యవసాయము, నౌకా నిర్మాణము, దానికి అనుబంధ వృత్తి అయిన వడ్రంగము, విదేశీ నౌకా వ్యాపారము, మొ||నవి ప్రధాన వృత్తులు. పల్లవ రాజ్య పతనానంతరము వారి సమూల నిర్మూలనే ధ్యేయంగా పెట్టుకున్న శత్రురాజుల బారినుండి తమను తాము కాపాడుకోవడానికి తీరప్రాంతానికి చేరి అప్పటికే అక్కడ నివసిస్తున్న ఆదివాసి మత్స్యకారులనుండి ఆ వృత్తిని స్వీకరించి వారి జీవనాధారంగా చేసుకొని అందులోనే కూరుకునిపోయి సుదీర్ఘకాలంలో జనాభా పెరిగి ఉండవచ్చు. దేనికైనా ఖచ్చితమైన లిఖిత చారిత్రకాధారాలు దొరకవు. భారతీయులు చరిత్రను గ్రంథస్తము చేసే అలవాటు లేదు.
కులాన్ని దాచుకోవడానికిగాని, ఇంటి పేర్లు మార్చుకొని సమాజంలో గౌరవంగా బ్రతకడానికి ప్రయత్నించడానికి గాని ఈ మత్స్యకార్మికవృత్తే కారణము. ఈ వృత్తిలో లేని స్వకులస్తులే ఈ వృత్తిదారులను ఈసడించుకుంటూ హీనంగా చూస్తారు. తీరప్రాంత వాసులతో సంబంధ బాంధవ్యాలు కూడా పరిమితంగానే ఉంటాయి.
2. మనం అ.క్ష.లమని అందులోనూ పల్లవులమని చెప్తున్నాము. ఇది వాస్తవము. కాని అ.క్ష.లకు మత్స్యవేటకులవృత్తిగా చెప్తూ దానిలోనే జీవన్మరణ పోరాటం చేస్తున్నాము. ఇది వాస్తవ విరుద్ధము.
పల్లవులు పాలకులు. వారి పాలనాకాలంలో పల్లవులు విదేశీ నౌకా వ్యాపారానికి ప్రాధాన్యతనిచ్చి మలయా, జావా, సుమత్రా, బాలి మొదలైన దూరస్త తూర్పుద్వీపాలకు, బర్మా, సయాం, కాంబోడియ, మొ||గు తూర్పుదేశాలకు అత్యంత సాహస ధైర్యాలతో నౌకాయానము చేసి ఆయాదేశాలను జయించి వలస రాజ్యములేర్పరిచి హిందూమత వ్యాప్తికి, భారతదేశ వాణిజ్య ఉత్పత్తులతో ఆయా దేశాల్లో వ్యాపారము జరుపుటకు పాటుపడి ఆంధ్రదేశానికే కాక యావద్భారత దేశానికి దిగంత విశ్రాంత కీర్తిని గడించినట్లు దేశీయ చారిత్రక పరిశోధకులు వ్రాసిన చరిత్ర ఉన్నది. (చూడు. భావరాజు వేంకట కృష్ణారావుగారి "ప్రాచీనాంధ్ర నౌకాజీవనము") అంతేగాని పల్లవులు మత్స్యపరిశ్రమను వృత్తిగా చేపట్టినట్లు ఎక్కడా చెప్పబడలేదు. అటువంటప్పుడు అ.క్ష.లమని, పల్లవులమని చెప్పుకుంటూ వారి కులవృత్తి మత్స్యవేట, మత్స్యపరిశ్రమ అని చెప్పుకుంటూ ఆ వృత్తితో సంబంధము లేని తోటికులస్తులలోనూ, సమాజం దృష్టిలోనూ హీనంగా ఎందుకు చూడబడాలి? ఈ మధ్యకాలం వరకు పరిపాలకులుగా ఉన్న అనేక రాజవంశముల వారు తమ ఆర్థికావసరాలకు ఈ మత్స్యపరిశ్రమతో పాటు అనేక ఇతర వృత్తులు చేపట్టినా వారికి గల గౌరవ మర్యాదలకు భంగము కలగలేదు. వారు రాజవంశీకులుగానే చూడబడుతున్నారు. వారికి ప్రత్యేకించి ఒక కులవృత్తి అంటూ ఏదీ లేదు. అ.క్ష. (పల్లవుల) వలెనే వారుకూడా మత్స్యపరిశ్రమతో పాటు అనేక వృత్తులలోనూ, వ్యాపారాలలోనూ ఉన్నారు.
కనుక అ.క్ష.లు తమ కులంపేరు దాచుకొని, మార్చుకొని, కులం మనుగడకే ముప్పువాటిల్లే పరిస్థితులు కలిగించకుండా ఉండాలంటే మత్స్యపరిశ్రమ, మత్స్యవేట ఆదికాలమునుండి వారి కులవృత్తి అని చెప్పుకోకుండా అది కేవలము వారి ఆర్థికావసరాలకు, ఇతర అనేక కులాల వలె ఏర్పరుచుకున్న అనేక వృత్తులో ఒకటిగా చెప్పుకొని వారి ప్రస్తుత జీవన విధానం ఉన్నతమైనదిగా మార్చుకొని సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగి తోటికులస్తులే కాక సమాజంలో ఇతరులు కూడా వారిని హీనంగా చూడకుండా గౌరవప్రదమైన జీవనం గడుపునట్లు మార్గదర్శనం చేయాలి.
3. నౌకాయానంతో తెలుగువెలుగు ప్రసరించినంత కాలానికి, తెలుగువారి నాగరికత దూరస్థ ద్వీపద్వీపాంతరాల్లో నాటుకున్న స్వర్ణయుగానికి, నౌకానిర్మాణ నైపుణ్యతలో విదేశీ వ్యాపారదక్షతలో ఆద్యులుగా, అనన్యులుగా నిలిచిన తెలుగువారు - అగ్నికుల క్షత్రియులు(పల్లవులు).
దేశీయ నౌకానిర్మాణము, దేశీయ నౌకా వ్యాపారము కూడా 20వ శతాబ్ది ఉత్తరార్థము (అనగా క్రీ.శ.1960_80 మధ్యకాలము) వరకు అ.క్ష.ల ఆధ్వర్యములోనే జరిగియుండుట జగమెరిగిన సత్యము. నేడు దేశీయ నౌకా రవాణా స్థానమునాక్రమించిన రోడ్డు రవాణా వ్యవస్థలో లారీ బాడీ బిల్డింగ్ పనిలో నిష్ణాతులైన వడ్రంగపు పనివారు అ.క్ష.లలో ఎందరో ఉన్నారు.
అంతేకాదు. పల్లవుల పాలనాకాలములో ప్రారంభింపబడి అభివృద్ధి చెందిన దేవాలయాల రాతి నిర్మాణము, నిర్వహణ ప్రస్తుతము అనేక ప్రాంతాలలో అ.క్ష.ల ఆధ్వర్యములోనే నడుస్తున్నది. 'ఆలయాలు నిర్మాణము చేసే పని అ.క్ష.లది' అని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీస్వామీజీ చెప్పారు. (ఆంధ్రజ్యోతి 29.4.2009) ఆయా దేవాలయాల పూజారులుగా కూడ అ.క్ష.లే వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు నెల్లూరు, గూడూరు తదితర ప్రాంతాలల్లోని శ్రీకృష్ణ ధర్మరాజ దేవాలయాలు అ.క్ష.ల అర్చకత్వంలోనే నడుస్తున్నవి. (ద్రౌపదికి శ్రీకృష్ణ అని మరోపేరు).
మత్స్యవేట అ.క్ష.ల కులవృత్తిగా చెప్పుకునే వారికి ఇది నమ్మశ్యంగా కనిపించకపోయినా ఇదే సత్యము.
4. అ.క్ష.కులం తప్ప ఇతర అనేక కులాల ప్రజలు తాము సమాజంలో అణగారియుండి, హీనంగా చూడబడుతూ కూడ ఎంతో ఔన్నత్యముతో, ఎంతో ఆత్మస్థైర్యముతో తమ కులానికి గౌరవప్రతిష్ఠలు పెంపొందించుకునే ఆశయంతో తగిన కృషి చేస్తున్నారు. కాని అ.క్ష.ల వలె ఇంకా ఇంకా క్రిందికి దిగజారి కుల అస్తిత్వానికే భంగం కలిగే విధంగా కృషి చేయరు. ఉదాహరణకు కొన్ని_
I. "దేశాన్ని ఏలే సత్తా మాదే. రానున్న 20, 30 ఏళ్ళల్లో అధికారంలోకి వస్తాము"అని, “ఆ దిశగా సంఘటితమై ముందుకువెళ్దాము. ధార్మిక చింతన ద్వారా సమాజంలో చైతన్యము తెద్దాము. సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా సంఘటితమవుదాం” అనీ అంతర్జాతీయ చమార్ సమ్మేళనములో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగారు పిలుపునిచ్చారు. (ఆంధ్రజ్యోతి 12.8.12). ఆయన సమాజ చైతన్యము, సామాజిక రుగ్మతల గురించి మాట్లాడారేగాని, వారి కులవృత్తి గురించి, వారి అభివృద్ధి గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
అ.క్ష.లు సమాజ చైతన్యము, సామాజికరుగ్మతల గురించి కాదుకదా, స్వకులం చైతన్యం గురించి , కులంలోని రుగ్మతల గురించి అయినా పట్టించుకోరు. ఎవరైనా సాహసించి ముందుకొస్తే వాళ్లను నిరుత్సాహపరిచి కాళ్ళకు తాళ్ళు కట్టి కిందకు లాగుతారు.
ii.కాపులను బి.సి.ల్లో చేర్చాలని, వెయ్యికోట్లతో ట్రస్టు స్థాపించాలని లేకుంటే "గుజ్జర్ల”తరహాలో పోరాటము చేస్తామని రాష్ట్ర కాపునాడు అల్టిమేటం ఇచ్చింది.(ఆంధ్రజ్యోతి 12.11.12.)
అ.క్ష. నాయకులు ఏనాడైనా ఇటువంటి ప్రకటన ఇవ్వగలిగిరా? ఛోటా నాయకులుగాని, బడానాయకులుగాని అ.క్ష.లు ప్రాణమే పెట్టుబడిగా చేసే చేపల వేటకు అవసరమైన పరికరములు, అందుకు అనుకూలమైన ప్రభుత్వ సహాయము గురించి మాట్లాడతారేగాని, మత్స్యఎగుమతుల ద్వారా ప్రభుత్వానికి అందే వేలకోట్ల ఆదాయమునుండి విద్యాభివృద్ధి కొరకు కొంత డబ్బు (కనీసము 2%) గ్రాంటుగా పొంది అభివృద్ధి చెందే విషయము ఆలోచించరు.
మన ముఖ్యమంత్రిగారు ఒక ప్రకటనలో 'ఏటా 11వేల కోట్ల రూపాయల మత్స్య ఉత్పత్తులు రాష్ట్రానికి అందుతున్నాయని, బడ్జెట్ లో మత్స్యకార్మికుల కోసం 60 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నామని' అన్నారు. (ఆంధ్రజ్యోతి 13.9.11). అంటే మననుండి ప్రభుత్వానికందే ఆదాయానికి, మనకు ప్రభుత్వం పెడ్తున్న ఖర్చు మధ్య నిష్పత్తి 100 : .54 (ఆదాయంలో 0.54 శాతం అన్నమాట). మిగతా 99.46 శాతం ఏమౌతున్నది? ఆ 60 కోట్ల రూపాయలు కూడా వేటపరికరాల రిపేర్ కొరకు అయి ఉండవచ్చు. అలా కాకుండా ఆదాయంలో కనీసం 2% (220కోట్లు) గ్రాంటుగా పొందగలిగితే హాస్టళ్ళతో కూడిన 20 పాఠశాలలు ఏర్పాటుచేసుకొని విద్యాభివృద్ధికి కృషిచేయవచ్చు.
iii. సగర కులస్తులకు పార్టీలు అన్యాయం చేశాయని, తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమము చేపడతామని సగరకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. శ్రీరాముడు తమ వంశానికి, కులానికి చెందిన వాడని అన్నారు. (ఆంధ్రజ్యోతి 12.11.12)
'కష్టాల కడలిలో సగరకులస్తులు' శీర్షికన రాష్ట్రంలో 55 లక్షల పైగా ఉన్న సగరకులస్తుల జీవనప్రమాణము నానాటికీ తీసికట్టుగా తయారవుతున్న దన్నారు. (ఆంధ్రజ్యోతి. 8.3.12)
iv. ఆర్థిక సమానత్వం కోసం, రాజకీయ అధికారం కోసం గొల్ల కురుమలు ఉద్యమించాలని "గొంగడి” మాసపత్రిక ఆవిష్కరణలో ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. అధికారం లేనందువల్లే గొల్లకురుమల జీవితాలను అవహేళన చేస్తున్నారని ఆక్షేపించారు. యాదవసంఘం సంఘటితం కావాలని యాదవులు తమ పూర్వీకుల గురించి తెలుసుకోవాలని ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీకె.శ్రీనివాస్ సూచించారు. దౌల్తాబాద్ లో కాకతీయుల కంటే ముందే యాదవరాజ్యం ఉండేదని శ్రీశైలం వంటి ప్రాంతాల్లో యాదవులు రాజ్యాలు ఏలిన దాఖలాలున్నాయని ఆయన చెప్పారు. (ఆంధ్రజ్యోతి 31.8.2011).
v. కమ్మ సామాజిక వర్గానికి జెండా, అజెండా అనే నినాదంతో విభిన్న పేర్లతో, విభిన్న వేదికలపై తమ సామాజిక వర్గంలో ఉన్న నిరుపేదలు, అట్టడుగున ఉన్నవారి అభ్యున్నతికి పనిచేయుట లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు ఒకే పేరుతో ఒకే అజెండాతో ఒకే జెండాతో నిర్వహిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. (ఆంధ్రజ్యోతి 30.9.12)
కమ్మవారు ప్రస్తుతము అనేక రంగాల్లో సమాజాన్ని శాసిస్తూ ప్రథమ స్థానంలో ఉండి కూడా ఇంకా అభివృద్ధి చెందడానికి కృషిచేస్తున్నారు. అంతేకాదు కమ్మవారు పల్లవ వంశీకులమని చరిత్ర వాసుకున్నట్లు తెలుస్తున్నది.
vi. శ్రీకృష్ణదేవరాయలు మా వాడేనంటూ బోయకులస్తులు వాదిస్తున్నారు. (ఆంధ్రజ్యోతి 12.82010). వీరి వాదనకు సరైన చారిత్రక ఆధారాలు లేవు. అయినా కూడా అలా చెప్పుకోవడం మెచ్చదగిన విషయం. మనం పల్లవులమని, అ.క్ష.లమని చెప్పుకోవాలంటే స్పష్టమైన లిఖిత చరిత్ర కావాలంటున్నారు మన పెద్దలు కొందరు. అదే అ.క్ష.లు మత్స్యకార్మికులమని చెప్పుకోవడానికి ఎటువంటి చరిత్ర అడగరు కానీ, కాదనడానికి మాత్రం లిఖిత చరిత్ర కావాలంటారు. ఇదొక వింత పరిస్థితి.
vii. రాయలు మావాడేనని ఆలిండియా యాదవ మహాసంఘము ప్రకటించింది. అంతేకాదు... రాయలు కాపుకులానికి చెందిన వాడనే వాదనగానీ ఆయన పేరుతో కాపుసంఘము పెట్టుకోవడము కాని సరికాదని ఆక్షేపించిందికూడా (ఆంధ్రజ్యోతి 8.10.12).
viii. శ్రీకృష్ణుడు యాదవ కులస్తుడని, యాదవులందరూ శ్రీకృష్ణుడి వంశస్తులేననే వాదన చాలా కాలంగా జరుగుతున్న విషయము అందరకూ తెలుసు.
ix. ఈ విధంగా శ్రీరాముడి వంశస్తులమని, శ్రీకృష్ణుడి వంశస్తులమని, శ్రీ కృష్ణ దేవరాయల వంశస్తులమని చెప్పుకునే అనేక కులాలవారు స్పష్టమైన లిఖిత చరిత్ర చూపలేరు. కనీసము ఆయా కులాల వారి వృత్తులను బట్టి అయినా పై వంశాలతో గల సంబంధమును ఋజువు చేయలేరు.
అయినా అనేక కులాల వారు ఇప్పటికే అత్యున్నత స్థితిలో ఉండి సమాజాన్ని శాసించే స్థితిలో ఉండి కూడా సంఘటితమై మరింత ఉన్నతస్థానము కొరకు పోరాడుతున్న వారైతే, కొన్ని కులాల వారు తమ ఆర్థికాభివృద్ధి కంటే ఎటువంటి చారిత్రకాధారాలు లేకపోయినా ఉన్నతమైన గుర్తింపుకొరకు ప్రాచీన రాజవంశాలతో తాదాత్మ్యత కొరకు నానా తంటాలు పడుతుంటే... అ.క్ష.లు మాత్రము వారి కులవృత్తి మత్స్యవేటగా చెప్పుకుంటూ అ.క్ష.లందరూ వారు ఏ స్థాయిలో ఉన్నా, మత్స్యవేటతోగాని మత్స్య పరిశ్రమతో గాని వారికి ఏనాడూ ఎటువంటి సంబంధమూ లేకపోయినను వారందరూ మత్స్యకారులేనని సమాజం భావించే విధంగా చెప్పుకుంటూ సమాజంలో చిన్నచూపుకు గురవుతూ, గౌరవంగా బతకాలని కోరుకునే వారికి కులం దాచుకునే దుర్బర పరిస్థితి కలిగిస్తున్నారు. అ.క్ష.లమని, పల్లవులమని చెప్పుకోవటానికి బలమైన చారిత్రకాధారాలు ఉండి కూడా అలా చెప్పుకొని సమాజంలో గౌరవప్రదమైన గుర్తింపు పొందాలనే ఆలోచనే రానీయరు. ఇంకా స్పష్టమైన చరిత్ర కావాలంటారు. దీనివల్ల కల్పిత చరిత్ర సృష్టికర్తలు తాము పల్లవ వంశీకుల మని చరిత్ర సృష్టించుకునే అవకాశము ఇస్తున్నాము.
5. కులవృత్తికి కొన్ని పరిమితులున్నాయి. కులవృత్తి అనేది ఒక్క కులం వారే పాటిస్తారు. ఇతరులెవరూ అందులో ప్రవేశించాలనికోరుకోరు. ప్రవేశించలేరు కూడా. ఉదాహరణలు అతి స్పష్టము. కాని మత్స్యపరిశ్రమ, మత్స్యవేట అట్లాంటిది కాదు. అది ఎవరైనా చేపట్టవచ్చు. అందులో ఇప్పటికే అనేక కులాలవారు ఉన్నారు. అది ఏ ఒక్క కులానికి పేటెంటు కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతువర్గం వారు, క్షత్రియ వర్గం వారు, ఇతర అనేక కులాల వారు తమ ఆర్థికపరిపుష్టికి తమ పొలాలను చెరువులుగా మార్చి మత్స్య పరిశ్రమ చేపట్టిన వారు ఉన్నారు. సమాజంలో వారి గౌరవానికి ఏమాత్రమూ భంగము కలగలేదు. అదే విధంగా అ.క్ష.లలో కూడ ఆదిమకాలం నుండి ఈ వృత్తితో సంబంధము లేనివారు మరియు ఒకవేళ ఆ వృత్తిని తాత్కాలికంగా జీవనాధారంగా ఏర్పరుచుకున్నా దాన్ని వదిలేసి వేరే వృత్తులలోకి మారినవారున్నారు. అయినా కులనామము అ.క్ష. అనగానే మత్స్యకారుల క్రింద జమకట్టి చిన్నచూపు చూస్తుంటారు. ఈ పరిస్థితి జన్మతః ఇతర కులవృత్తిదారులకు లేదు. వారు తమ ప్రాచీనకుల నామము మార్చుకొని గౌరవ ప్రదమైన నామమేర్పరుచుకొని సమాజంలో చలామణి అవుతుండగా అ.క్ష.లు మాత్రము తమకు గల అసలు పేరును వదిలేసి తాము పల్లెకార్లమని చెప్పుకుంటుంటారు. సమాజంలో పల్లెకార్లంటే చేపలుపట్టే కులవృత్తిదారులుగా జమకట్టి చిన్నచూపు చూడబడుతుంటారు.
కనుక అ.క్ష.లు జాగృతమై సమాజంలో తమ కులమునకు సమున్నత స్థానం కలిగించి ఇతర కులాలను మించిన గౌరవప్రతిష్ఠలు సాధించాలి. సమాజంలో ప్రస్తుతము అ.క్ష.లకున్న హీనమైన గుర్తింపును తుడిచేసి ఉన్నతమైన గుర్తింపును పొంది, ప్రాచీన ఆంధ్రదేశానికి, భారతదేశానికి పల్లవుల పరిపాలనలో కలిగిన విధంగా కీర్తిప్రతిష్ఠలు కలిగించాలి. లక్ష్యము ఉన్నతంగా ఉండాలి. లక్ష్యసాధనకు మార్గాలు వాటంతట అవే సమకూరుతాయి. అందుకు కులవృత్తి, అది మత్స్యపరిశ్రమకాని, చర్మపరిశ్రమ కాని, కసాయివృత్తి కాని అడ్డంకి కాదు.
6. ఈ సందర్భంగా 'బ్రాహ్మణ' అను నామమునకు చిన్నయానంద స్వామి ఇచ్చిన నిర్వచనము చూద్దాము. బ్రాహ్మణుడు అనగా బ్రహ్మజ్ఞానం పొందడం లక్ష్యంగా ఉంచుకోవాలి. ఆయన ముండకోపనిషత్తుపై వ్రాసిన వ్యాఖ్యానంలో ఏమన్నారంటే.... 'ఎవనికైతే పవిత్ర భావన, విచక్షణాబుద్ధి, హృదయపూర్వక ఉద్దేశాలు, ఆత్మజ్ఞాన మందు ఆతురత మొదలగునవి కలవో అట్టివాడు మాంసవిక్రేత స్థానమున కూర్చున్నవాడైనను, యాగాగ్నిముందర కూర్చున్నవాడైనను, పూజాగృహమునందున్న వాడైనను, రైల్వేస్టేషనులో నున్నవాడైనను, గంగాతీరమునందు నివసించువాడైనను, బజారులో తిరుగుచుండు వాడైనను శాస్త్ర దృష్ట్యా అతడే బ్రాహ్మణుడు'అన్నారు.
దీన్నిబట్టి అర్థమవుతున్నదేమిటి?
లక్ష్యము ఉన్నతంగా ఉండాలని, లక్ష్యసాధనకు జీవనమార్గము ఏదైనా ప్రధానము కాదనికదా! మరి అ.క్ష.లలో కొందరు వారి జీవనం కొరకు తప్పనిసరి పరిస్థితిలో మత్స్యకారులుగా మారి దానినుండి బయటపడలేనంత మాత్రాన అ.క్ష.లు అందరూ ఎందుకు ఆత్మన్యూనతకు లోనుకావాలి? కులాన్ని ఎందుకు దాచిపెట్టాలి? అ.క్ష.ల కులవృత్తి మత్స్యవేట అనేదిమాత్రము ముందు మన మెదళ్లనుంచి తొలగించాలి. తర్వాత సమాజం దృష్టిలోంచి తొలగించాలి. సమాజం నుండి గౌరవప్రదమైన గుర్తింపు పొందే విధంగా ఆధ్యాత్మికంగా ఎదగాలి. సమస్యలన్నింటికి పరిష్కారము ఆధ్యాత్మికతతోనే దొరుకుతుందంటారు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ జీ.
7. ఏది సాధించాలన్నా సంఘటిత శక్తి కావాలి. సంఘటిత శక్తికి ఒక గొప్ప ఉదాహరణ తేనెటీగ. ఒక తేనెటీగను ఎవరైనా కొట్టినా, నలిపేసినా లేదా రెచ్చగొట్టినా మిగతా అన్ని తేనెటీగలు అవెంత చిన్నవైనా, బలహీనమైనవైనా మనిషి లేదా ఏనుగంత బలమైన జంతువుల్ని సైతము పరాజయమొనర్చ గలవు. అటువంటి ఐక్యత మన కులానికి కావాలి.
అగ్నికుల క్షత్రియ సోదర మహాశయులారా! లేవండి. జాగృతమవండి. లక్ష్యసాధనకు ఉద్యమించండి. లక్ష్యం సాధించేవరకు విశ్రమించకండి.
UttishtataJagruta.pdf