20, జులై 2013, శనివారం

యువతకు విజ్ఞప్తి!


అగ్నికులక్షత్రియయువతకు విజ్ఞప్తి!

అగ్నికులక్షత్రియులను S.T.లలో చేర్చాలని గట్టిప్రయత్నము జరుగుతుంది. బెస్త, జాలరి, పల్లి మొదలగు 14 కులాలతో కలిసిన అగ్నికులక్షత్రియులు కోటిన్నరమంది ఉన్నారని అంచనా వేస్తున్నారు. అందరూ 50, 60 సం||ల నుండి B.C.లలో ఉండి వారికి ప్రభుత్వము కల్పించు B.C.రిజర్వేషన్ వినియోగించుకొని లక్షలాది మంది అగ్నికులక్షత్రియులు అభివృద్ధి చెంది ఉంటారు. అయినా వారు బ్రతుకుతెరువు కొరకు చేపట్టిన వృత్తిలోనే కొనసాగుతూ వారి అభివృద్ధిని బాహ్యప్రపంచానికి తెలియకుండా దాచుకొని వారికి ప్రభుత్వం కల్పించిన B.C. రిజర్వేషన్ వల్ల ఎటువంటి ప్రయోజనము కలగలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు రిజర్వేషన్స్ అమలులోకి రాకపూర్వము ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారన్నది ప్రస్తుతం ST రిజర్వేషన్ కొరకు పోరాడుతున్న వారి అభిప్రాయమా? లేదు.... BC రిజర్వేషన్ వల్ల ఎటువంటి అభివృద్ధి లేదు... STలలో చేరితేనే అభివృద్ధి ఉంటుంది అన్న అభిప్రాయమా? మరి BC రిజర్వేషన్ ఉపయోగించుకొని అభివృద్ధి చెందలేని వారు, సమాజంలో చిన్నచూపు చూడబడటానికి కారణమైన వారి వృత్తిని వదలలేనివారు రేపు ST రిజర్వేషన్ ఉపయోగించుకొని అభివృద్ధి చెందగలరని గ్యారెంటీ ఉందా? వారు - ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగి ప్రస్తుతము వీటితోపాటు ఉభయ మీడియాలను, సినిమా, కళలు, సాహిత్యము, విద్య మొదలగు రంగాలను వారి గుత్తాధిపత్యము క్రింద నడుపుతున్న అగ్రకులాల సరసన నిలబెట్టగలరా? అబ్బెబ్బే! అంతలేదంటారేమో! మరి అభివృద్ధికి నిర్వచనమేమిటి? ప్రభుత్వమునుండి ఎటువంటి సహకారము అందుకోకుండా సమాజాన్ని శాసించే స్థితికి ఎదిగిన ప్రధాన కులాలు రెండింటిలోనూ - పుట్టిన ప్రతి ఒక్కడు పుడుతూనే నోట్లో బంగారుచెంచాతో పుట్టలేదు. పైగా వారి వృత్తి వ్యవసాయము ఒక్కటే. దాని ద్వారా బ్రిటిష్ పాలనాకాలంలో వారికి అందివచ్చిన చేయూతద్వారా వారు అభివృద్ధి చెందలేదా? ఇప్పుడు వారు ప్రభుత్వంనుండి ఏ సహకారమూ ఆశించడం లేదు. స్వయంకృషితో, స్వయంపోషకత్వంతో వారు అభివృద్ధి చెందారు. చెందుతున్నారు.
కాని అగ్నికులక్షత్రియులు వ్యవసాయము, నౌకాపరిశ్రమ, దానికి అనుబంధంగా ఉన్న వడ్రంగము, నౌకాయానము, విదేశీ నౌకా వ్యాపారము, కమ్మరము, శిల్పకళ మొదలగు అనేక వృత్తులలో ఉన్నారు. ఇవన్నీ వదిలేసి కులపెద్దలు కొందరు మన కులవృత్తి చేపలవేటగా నిర్ణయించి, అగ్నికులక్షత్రియులను ఆత్మన్యూనతకు లోనుచేసి ఆ వృత్తితో ఎటువంటి సంబంధమూ లేని అనేక వేల కుటుంబాలవారికి సమాజంలో విలువ లేకుండా చేశారు. అది చాలదన్నట్లు ప్రస్తుతము అగ్నికులక్షత్రియులను ST లలో చేర్పించి, చెంచు, సుగాలి, ఎరుకల, యానాది తదితర 35 కులాల సరసన కూర్చోబెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
పరిణామ(మార్పు) క్రమంలో ఒక జీవి అభివృద్ధి దిశగా పయనించాలి. పతనంవైపు కాదు. కాని అగ్నికులక్షత్రియుల పూజ్యపెద్దలు ఒకప్పుడు OCలలో ఉన్న కులాన్ని BCలలోకి మార్పించారు. BCలలోకి మార్చడం వల్ల వారు ఆశించినది నెరవేరుతూనే ఉంది. అవసరమున్న వారు దాన్ని ఉపయోగించుకుంటూనే ఉన్నారు. అయినా BCరిజర్వేషన్ వల్ల ఆశించిన ఫలితం దక్కలేదనే నెపంతో మరలా STలలోకి మారడానికి కృషి మొదలుపెట్టారు పూజ్యపెద్దలు కొందరు.
అంతగా STలలో చేర్చడం తప్పనిసరి అయితే అగ్నికులక్షత్రియులుగాక మిగిలిన అసలు సిసలైన 14 మత్స్యకార కులాలను ST లలో చేర్చుటకు కృషిచేసి, పోరాడి సాధించవచ్చు. అగ్నికులక్షత్రియులను స్వయంకృషితో స్వయంపోషకత్వంతో అభివృద్ధి చెందునట్లు మార్గదర్శనం చేయవచ్చు. ఇందువల్ల వారు బ్రతుకుతెరువుకొరకు ఏర్పరుచుకున్న ఏ వృత్తినీ వదులుకోనక్కరలేదు. అందులోనే కొనసాగుతూ దివ్యమైన జీవితం గడుపుతూ, సమాజంలో వారు కోల్పోయిన విలువలను పునరుద్ధరించుకోవచ్చు.

అగ్నికులక్షత్రియ సోదరీ సోదరులారా! మేల్కొనండి!!

సమాజంలో అగ్నికులక్షత్రియులు కోల్పోయిన విలువల పునరుద్ధరణకు కృషిచేద్దాం రండి!!


నిస్వార్థంగా కృషిచేయగల నూరుమంది కలిస్తే కొండలను సైతం పిండిచేయవచ్చు . ఆలోచించండి!!!


....................................................................................................................................................................................................
ఒడుగు నరేష్ వర్మ - 9700472572

సంఘేశక్తి కలౌయుగే.....


'సంఘేశక్తి కలౌయుగే - కలియుగంలో సంఘానిదే శక్తి'
మత్స్యకారేతర అగ్నికులక్షత్రియ సోదరులకు,
మన కులస్తులు జీవనాధారంగా అనేక వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు చేపట్టియున్నారు. అందులో చేపలుపట్టి అమ్ముకునే మత్స్యకార వృత్తి ఒక జీవనాధార వృత్తి. ఈ వృత్తే సమాజంలో మన కులానికి హీనమైన గుర్తింపుకు కారణము. మత్స్యకార వృత్తి కేవలము అగ్నికులక్షత్రియులకే పేటెంట్ హక్కు కాదు. అందులో అనేక ఇతర కులాల వారు ఉన్నారు. కమ్మవారు, రాజులు కూడా వారి పొలాలను చెరువులుగా మార్చి ఈ వృత్తి చేపట్టినవారున్నారు. కాని మన సంఘ పెద్దలు కొందరు మత్స్యకారవృత్తిని మన కులవృత్తిగా డిక్లేర్ చేసి దాని అభివృద్ధికి, దానిలో తలెత్తే అనేక సమస్యల పరిష్కారమునకు తలమునకలుగా విఫలయత్నం చేస్తున్నారు. ఆ వృత్తిలో తరతరాలుగా ఏ కాలంలోనూ ఎటువంటి సంబంధమూ లేని వేల కుటుంబాలవారు ఉన్నారు. ఉదాహరణకు... వ్యవసాయము, నౌకానిర్మాణము, దాని అనుబంధ వృత్తులయిన వడ్రంగము, కమ్మరము . కొద్ది సంవత్సరాల క్రితంవరకు నౌకాయానము, నౌకావ్యాపారము మొ|| అనేక వృత్తులలో గౌరవప్రదమైన గుర్తింపు కలిగియున్నారు. అటువంటి వారు కూడా ఈ కులవృత్తి నినాదము వల్ల సమాజంలో మత్స్యకారులుగానే పరిగణింపబడుచూ అణగారి ఉండవలసిన దుస్థితిలో ఉన్నారు. సమాజంలో మత్స్యకారవృత్తికి కలిగిన హీనమైన గుర్తింపును (దీనికి స్పష్టమైన కారణం ఎవరూ చెప్పలేరు) తొలగించే ప్రయత్నం ఇంతవరకు సక్రమమైన మార్గంలో జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆ వృత్తిలో ఉన్నవారికి సమస్యను గుర్తించే శక్తిలేదు. ప్రతి దినము వారికి కావలసింది వారికి అందుతున్నది కనుక సమస్యను గురించి ఎవరైనా వివరించినా ఒప్పుకోరు. ఇక ఆ వృత్తిలో లేనివారైతే తమ కులమేమిటో సాధ్యమైనంతవరకు బయటపడకుండా కాపాడుకుంటారు. మన కులవృత్తి సమస్య చాలా జటిలమైనది. కులం పేరు చెబితే ఆత్మన్యూనత, చెప్పకపోతే ఆత్మద్రోహము. ప్రస్తుతము రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడి నడుస్తున్న అగ్నికులక్షత్రియ సంఘాలు సమాజంలో కేవలము మన కులానికే కాక ఇతర అనేక కులాలకు సంబంధం గల మత్స్యకారవృత్తి గురించి పోరాటమో లేక ఇంకేదైనా చేసినా విజయంమాత్రం శూన్యము. ఈ వృత్తితో సంబంధం లేని కళ్ళు మూసుకున్న పిల్లుల్లాంటివారు బయటకిరారు, వారి సహకారం అందించరు.
కొన్ని సూచనలు :
    1. ప్రస్తుతము రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘాలను మత్స్యకారుల కులవృత్తి అభివృద్ధికొరకు వదలి, మత్స్యకారవృత్తిలో లేని అగ్నికులక్షత్రియులందరూ సంఘటితమై వేరొక సంఘాన్ని స్థాపించి దాని పేరును అగ్నికులక్షత్రియ (పల్లవ) సేవాసంఘంగా ఉంచి స్వయంపోషకత్వంలో అగ్నికులక్షత్రియులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, కళారంగంలోను, ఆధ్యాత్మికరంగం లోను అభివృద్ధి చెంది, మన కులానికిగల పూర్వపుటౌన్నత్యాన్ని పునరుద్ధరించే విధంగా కృషి చేసి కులం దాచుకునే పరిస్థితినుండి బయటపడాలి.
    2. సంఘానికి ఒక చిన్న ఆఫీసు ఉండాలి. ఉద్యోగస్తులు ముఖ్యంగా రికార్డింగ్ సెక్రటరీ, ట్రెజరర్ / క్లర్క్, అటెండరు, వాచ్ మెన్ ఉండాలి.
    3. సంఘానికి సభ్యత్వము కనీసం 10వేలు ఉండాలి. (వారికి ప్రవేశరుసుము రూ.11.25పై., ప్రతినెలా రూ.12.00 చెల్లించగలిగినవారు ఉండాలి.) సంఘకార్యవర్గ సభ్యులు నిజాయితీగా ఉండాలి. ఖచ్చితంగా పనిచేయాలి.
    సంఘంలో ప్రవేశరుసుమునుండి ఆఫీసు ఫర్నిచర్, స్టేషనరీ మొ||గు వాటికి ఖర్చుచేయాలి. నెలసరి చందా 12రూ.లలో రూ.3.00లు స్థానిక కార్యకర్తలకు, రూ.3.00లు సంఘ ఆఫీసు అద్దె, ఉద్యోగస్తుల గౌరవ వేతనంగా గానీ, పూర్తివేతనంగాగానీ ఖర్చు చేయవచ్చు. రూ.6.00లు బ్యాంకు డిపాజిట్ చేసి దానిపై వచ్చు వడ్డీతో మూడవ సం||మునుండి సేవాకార్యక్రమాలు చేపట్టవచ్చు. 5సం||లు పూర్తయేటప్పటికి అసలు డబ్బు 36లక్షలు నిల్వ ఉంటుంది. 5సం||లలో వడ్డీ రూ.4,30,000లు సేవాకార్యాక్రమాలకు ఖర్చు చేయవచ్చు. ఇందుకు ఒక ట్రస్ట్ ఏర్పాటుచేసుకోవచ్చు.
        ఆలోచించండి.....
    సంఘటిత శక్తికి ఏనాడూ తిరుగులేదు....
    ఆశక్తి మనకు కావాలి!!!