22, సెప్టెంబర్ 2012, శనివారం

కరపత్రము - 4
సంఘేశక్తిః కలౌయుగే
కృణ్వంతో విశ్వమార్యం
అగ్నికులక్షత్రియ సోదరులకు విజ్ఞప్తి,
నేడు అగ్నికులక్షత్రియు (అ.క్ష.)లని పిలువబడేవారు ఆనాటి పల్లవులేననేది నిర్వివాదాంశము.  దానికి ప్రత్యేకమైన ఋజువులు వెదుకనక్కరలేదు. "పల్లవ"  అను పదమే "పల్లి"గా మారిందని, రెండూ ఒక్కటేనని చారిత్రకాధారాలు లేని ఊహాత్మక నిర్ణయానికి వచ్చి అలాగే చెప్పుకొని సమాజం చేత అ.క్ష.లందరూ మత్స్యకారులేనని, మత్స్యకారులందరూ అ.క్ష.లేనని చెప్పబడుతూ అణచివేయబడి ఆత్మన్యూనతకు లోనవడం అంగీకారయోగ్యంకాదు.
పల్లవులు హిందూధర్మ రక్షణకు పాటుపడి అనేక హిందూదేవాలయాలను నిర్మించినట్లు చారిత్రకాధారాలున్నవి. పల్లవ రాజవంశపాలన కాలంలో నౌకానిర్మాణమును, నౌకాయానమును అభివృద్ధి చేసి దూరస్థ తూర్పుదీవులలోను, తూర్పుదేశాలలోను వలసరాజ్యములేర్పరిచి వ్యాపారాభివృద్ధి చేసి ఆంధ్రదేశానికేకాక యావద్భారతదేశానికి దిగంతవిశ్రాంత కీర్తిని గడించినట్లు చరిత్ర ఉంది. (భావరాజు వేంకటకృష్ణారావు గారి "ప్రాచీన ఆంధ్రనౌకాయానము"). నేడు పల్లవ అను పదమును పల్లిగా మార్చి చెప్పుకొని, అలాగే పిలువబడుతున్న అ.క్ష.లకు పై రెండు అంశాలతో ఎంతో ఘనమైన అనుబంధమున్నది. ఈ యాంత్రికయుగంలో నౌకాయానవృత్తి, నౌకావ్యాపారము అ.క్ష.లకు దూరమైనా దేవాలయ వ్యవస్థ మాత్రము ఇంకా పూర్తిగా వారికి దూరం కాలేదు. నెల్లూరు జిల్లాలోను, తమిళప్రాంతాల్లోనూ అనేక దేవాలయాలు అ.క్ష.లు లేక వహ్నికుల క్షత్రియుల ఆధీనంలోనే ఉండి,
వారే పూజారులుగా నడచుచుండుట ఇందుకు నిదర్శనము.
ప్రస్తుతం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారి మాత వకుళాదేవి ఆలయము అన్యాక్రాంతమై శిథిలావస్థలో ఉంది. ఆ ఆలయ పునరుద్ధరణకు కాకినాడ శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద సరస్వతి వారు చేస్తున్న ప్రయత్నము లోకవిదితము.
తిరుమలతిరుపతి దేవస్థానంతో పల్లవులకు ప్రత్యక్ష అనుబంధము వున్నట్లు
శాసనాధారాలు దొరుకుచున్నవి. ఆంధ్రదేశంలో పల్లవుల పాలన అంతమైన తర్వాత దక్షిణభారత దేశంలో పల్లవులు పరిపాలనా కాలమైన క్రీ.శ.7వ శతాబ్ద ఆరంభంనుండి స్థానిక రాజకుటుంబాలకు చెందిన రాకుమారులు, ప్రముఖ నాయకులు, పల్లవ రాజుల ఆధీనములోని పాళెయగారులు మొదలైన వారు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాభివృద్ధికి తోడ్పడ్డారు. పల్లవరాజుల కాలానికే చెందిన రాణి సామవై 8, 9 సంఖ్యలుగల రెండు శాసనములు వేయించింది.  శ్రీ వేంకటేశ్వరుని మూలమూర్తిని పోలిన ఒక వెండి ఉత్సవమూర్తిని వివిధ ఆభరణాలతో అలంకరింపజేసి సంవత్సరానికొక్కమారు ఒక వారంరోజులపాటు రెండుపూటలా ఊరేగింపుతో ప్రత్యేక ఉత్సవం జరిగే ఏర్పాట్లు చేసినట్లు ఆ శాసనాలవల్ల తెలుస్తున్నది. నిత్యదీపనైవేద్యాల కొరకు ఆమె ఏర్పాటు చేసింది. ఇంకా ఆమె భాద్రపదము, మార్గశిరమాసాలలో ఉత్సవాలు జరిగేటట్లు ఏర్పాటు చేసినట్లుగా ఆ శాసనాలవల్ల తెలుస్తున్నది. పల్లవుల తర్వాత రాజ్యాధికారం చేపట్టిన చోళరాజులు కూడా పరిపాలన సౌలభ్యం కొరకు పల్లవుల సామ్రాజ్యకాలంలో అవలంబించిన ప్రాంతవిభాగ పద్ధతి ఆ తర్వాతి కాలంలో కూడా అమలులో ఉండినది. వాటి పేర్లు కూడ మార్చబడకుండా యథాతథంగా ఉంచబడ్డాయి. పల్లవుల కాలానికు పూర్వం పూజలకొరకు తిరుమల దేవాలయానికి చేరడం కష్టసాధ్యంగా వుండి పూజలు సరిగా జరిగేవికావట. పల్లవుల పాలన కాలంలోనే ఆలయానికివెళ్ళి పూజలు చేసే విధానం ప్రాచుర్యానికి వచ్చివుంటుంది. (సప్తగిరి 12/08, 1/2000)ఈ విధంగా కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయము పల్లవ రాజవంశ పాలనాకాలంలో ఎంతగానో అభివృద్ధి చెందింది. అప్పుడు ఏర్పాటు చేయబడిన దేవాలయ పాలనా పద్ధతులు, ఉత్సవాలు యధాతథంగా ఇప్పటికీ కొనసాగుచున్నవి. ఇది అతి పురాతన కాలంనుండి కొనసాగుచున్న చారిత్రకాంశం.
ఇటీవల విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి హిందూ దేవాలయ వ్యవస్థకు కులాలతో గల సంబంధమును వివరిస్తూ దేవాలయాలు నిర్మాణం చేసేపని అ.క్ష.లది అని చెప్పారు. (ఆంధ్రజ్యోతి 29.04.2009). అ.క్ష.లే పల్లవులని ఆధారాలున్నవి. అలా ఋజువు  చేయుటకు ప్రత్యేకంగా శ్రమపడనవసరంలేదు. అ.క్ష.లే పల్లవులని చెప్పడంలోగల లోపాన్ని సరిచేసి జీవనాధారంగా చేపట్టిన ఏ వృత్తులకైనా అతీతంగా ఎదిగి సమాజాన్ని ముందుండి నడిపించగల స్థాయికి ఎదుగుటకు తగిన కృషి జరగాలి. కనుక అన్యాక్రాంతమైన శిధిలావస్థకు చేరుకున్న వకుళమాత దేవాలయ పునరుద్ధరణకు స్వామి పరిపూర్ణానంద సరస్వతి వారు తలపెట్టిన కృషి ప్రారంభమైనప్పుడు అ.క్ష.లు కూడా పాలుపంచుకొని తను, మన, ధన పూర్వకంగా శక్తిమేరకు సహకారమందించి తద్వారా తమ నిజస్వరూపాన్ని సమాజానికి చెప్పకనే చాటిచెప్పుటకు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే మంచిదని నా భావన.
నా అభిప్రాయానికి రాజకీయాలకు అతీతంగా పాజిటివ్‌గా స్పందించినవారు, రాష్ట్రసంఘ నాయకులు స్వామి పరిపూర్ణానంద సరస్వతి వారితో సంప్రదించి తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుటకు ప్రేరణ కలిగించవలసినదిగా మనవి.

వెయ్యిమాటలకన్న ఒక పని ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది.
కరపత్రము - 3
"సంఘేశక్తిః కలౌయుగే"
(కలియుగంలో సంఘానిదే శక్తి)
అగ్నికులక్షత్రియ సోదర మహాశయులకు,
అ.క్ష.లు తాము సమాజంలో చిన్నచూపు చూడబడుచున్నామని, అణచివేతకు గురవుతున్నామని పదే పదే బాధపడుతుంటారు. పేదవాని కోపం పెదవికి చేటు  అన్నట్లు ఉంటారేగాని అణచివేతను ఎదుర్కొనే ప్రయత్నమేదీ చేయరు. మౌనము అంగీకారము అవుతుంది. స్వాతంత్రానంతరము చైతన్యవంతులై ప్రభుత్వ రక్షణతో కులదూషణను ఎదుర్కొంటున్నవారు సైతము వీరిని చిన్నచూపు చూస్తుంటారు.
అ.క్ష.లను సమాజం తేలికగా చూచుటకు, వారు కూడ అమాయకత్వంతోనో, అబలత్వంతోనో, ఆత్మన్యూనతకు గురి అగుటకుగల కారణము, తమ కులాన్నిఅ.క్ష.లని వారే చెప్పుకోకపోవడానికి, కుల దూషణను ఎదుర్కోలేకపోవుటకు గల కారణము అన్వేషించి తొలగించవలసివుంది. కేవలము అ.క్ష.లలో కొంతమందికి తమ జీవనాధారంగా చేపట్టిన మత్స్యకారవృత్తి మాత్రమే అందుకు కారణంగా కనబడదు. అనేక ఇతర కారణాలలో అది కూడా ఒకటి కావచ్చు. ఎందుకనగా ఆ వృత్తి, వారికి పేటెంట్ కాదు. మత్స్యకారవృత్తిలో, మత్స్యకార్మికులలో అసలు మొత్తము మత్స్యపరిశ్రమలోనే అనేక కులాలవారు ఉన్నారు. అనేక అగ్రకులాలవారు ధనార్జనకు మత్స్యపెంపకము చేపట్టి, చెరువులు తవ్వించుకొని మత్స్యవ్యాపారము చేయుచున్నారు. కేవలం కొన్ని వందల సంవత్సరముల క్రిందట (అనగా 12, 13 వందల సం||ల క్రిందట) క్లిష్ట పరిస్థితుల్లో జీవనాధారంగా మత్స్యకారవృత్తి చేపట్టిన అ.క్ష.లలో కొందరు కూడ అటువంటివారే. ఇన్ని వందల సం||లుగా ఆ వృత్తిలోనించి బయటపడే దిక్కు లేనివారు అందులోనే స్థిరపడిపోయి కొనసాగుచుండవచ్చు. అంతమాత్రాన ఆవృత్తిమీద ఆధారపడిన ఇతర కులాల వారికిలేని న్యూనతాభావము అ.క్ష.లకు ఎందుకుండాలి?
అ.క్ష.లను సమాజము చిన్నచూపు చూడటానికి వారే కారణము. తమ ఔన్నత్యాన్ని తామే మరచిపోయి ఆదిమవాసులైన మత్స్యకారులలో కలిసిపోయివందల సం||లు గడిచిపోవుటవల్ల వారు కేవలము మత్స్యకారులేనని భావించడమే అందుకు కారణం. ఆ భావననుండి బయటకు తేవటానికి గట్టి కృషి జరగాలి. ఇక్కడ స్వామి వివేకానంద తరచుగా చెప్పిన ఒక కథ గుర్తుచేయాలి. ఇది అందరకు తెలిసిన కథే అయినందువల్ల క్లుప్తంగా.....
నిండు గర్భంతో ఉన్న సింహము ఒకటి గొర్రెల మందపై దూకింది. పొరపాటున క్రిందపడుటవల్ల గర్భవిచ్ఛిత్తి జరిగి ఒక పిల్లను కని చనిపోయింది. ఆ
 పిల్ల గొర్రెలతోపాటే పెరిగిపెద్దదైంది. అన్నీ గొర్రె లక్షణాలే వచ్చాయి. గొర్రెల్లా అరవడం, తినడం చేస్తూండేది. ఒకరోజు మరో సింహము ఆ మందపై
దాడి చేసింది. గొర్రెలతోపాటే ఉన్న సింహంపిల్ల కూడా పరుగు లంకించుకుంది. దాన్ని చూచి ఆశ్చర్యపోయిన సింహం దాని జూలు పట్టుకొని దాన్ని ఒక నీటిమడుగువద్దకు తీసుకువెళ్ళి దాని నిజస్వరూపం చూపించి దాని జాతిని గుర్తుచేసింది. అప్పటినుండి గొర్రెలాగ పెరిగిన సింహంపిల్ల నిజమైనసింహంగా మారింది.
అదేవిధంగా 12, 13వందల సం||ల క్రిందట మాత్రమే అప్పటి క్లిష్టపరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులుగా మారిన అ.క్ష.లలో కొందరు కాలక్రమేణా వారి నిజస్వరూపమును మరచిపోయి మత్స్యకారులతో కలసి బ్రతుకుతూ తమ కులం పేరు చెప్పవలసినచోట 'అగ్నికులక్షత్రియ ' బదులు పల్లెకారి అని చెప్పడమే వారి ఆత్మన్యూనతకు నాంది. వారి నిజస్వరూపం వారికి గుర్తుచేయాలి. అ.క్ష.లు కానివారు బెస్త, జాలరి, వాడబలిజ, పల్లి, గంగవార్, గంగ పుత్ర మొదలగు అనేక కులాలవారు ఉన్నారు. అవి వేర్వేరు కులాల పేర్లు. వారి ఆర్థిక స్థితిగతులనుబట్టి వారి ఆర్థికాభివృద్ధి అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వము వారి వృత్తి ఆధారంగా బి.సి.లలో ఉన్న అన్ని కులాల వారికంటే కూడ ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వారిగా గుర్తించి బి.సి.-ఎ(1)లో చేర్చింది. ఈ వృత్తిమీద ఆధారపడి బ్రతికేవారు బి.సి.-ఎ(1) లోని కులాలవారే కాక ఇతర బి.సి. కులాలు వారు అనేక మందితోపాటు వీరి ఆర్థికావసరాలు తీర్చే దళారివర్గంవారు కూడా ఉన్నారు. వారే మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి గండి కొట్టి వారు అభివృద్ధి చెందుతున్నారు. ఈ వృత్తిదారులలో అనేకమంది మధ్యదళారులకు సహాయకారులుగా ఉండి వారి సంపాదనంతా దళారులకు దోచిపెట్టి వారి దయాదాక్షిణ్యాలపై బ్రతుకుతున్నారు. ఇది ప్రభుత్వమువారు కూడా గుర్తించి ఆందోళన వ్యక్తపరిచిన విషయము ఆంధ్రజ్యోతి 10-7-2010న ప్రచురించింది.
అ.క్ష.లకు ఘనమైన ప్రాచీన చరిత్ర ఉంది. (చూడు. కరపత్రం 1, 2). చరిత్ర గురించి పూర్తిగా తెలియని వారే కులం పేరు చెప్పవలసిన చోట పైన చెప్పబడిన కులాల్లో ఏ పేరునూ చెప్పకుండా, ఠక్కున ఏ చారిత్రక ఆధారము లేని పల్లెకారి అని చెబుతారు. వారి దృష్తిలో పల్లెకారి అంటే పల్లవులు అను పేరుకు రూపాంతరమని, అది చాలా గొప్ప కులమని భావన్ ఉంది. కాని సమాజం దృష్టిలో పల్లెకారి అంటే పై కులాలలోని పల్లి అనీ వారు కేవలము బెస్త, జాలరి మొదలగు కులాలవంటి చేపలోళ్ళేననే భావన ఉంటుంది. తాతముత్తాతల నాటి నుండి మత్స్యకారవృత్తితో ఎటువంటి సంబంధంలేకుండా సమాజంలో మంచి గౌరవం పొందుతున్నవారు, వ్యక్తిగా ఎంతో విలువపొందినవారు వారి కులం పల్లెకారి అని చెప్పగానే అప్పటివరకు వారికి ఉన్న విలువ, గౌరవం ఒక్కసారిగా మారిపోతుంది. వీడు చేపలు పట్టుకునే కులం వాడా! అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తర్వాత సంబోధన మారిపోతుంది. అంతెందుకు - స్వకులంలోనివారే కొందరు స్వయంకల్పిత రాజు కులమని చెప్పుకుంటూ, మరికొందరు మార్చుకున్న ఇంటిపేర్లుబట్టి వేరే కులస్తులుగా చెలామణి అవుతూ పల్లెకారి అని చెప్పుకునే తోటి కులస్తుణ్ణి హీనంగా చూస్తారు. వారిలో మైదానప్రాంతవాసులు , తీరప్రాంతవాసులతో సంబంధబంధవ్యాలు కూడా అరుదుగా మాత్రమే జరుగుతాయి. కొందరైతే అటువంటి వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తారు. వీరి చర్య మాత్రము ఇతర కులాల వారికివలె చాటుమాటుగా కాకుండా బాహాటంగానే ఉంటుంది. మున్ముందు ఇటువంటి వారిని సంస్కరించాలి.
ఇలా ఎందుకు జరుగుచున్నది? దీనికి కారణమేమిటి? మత్స్యకారవృత్తి అంత హీనమైనదా? మత్స్యకారులవల్ల సమాజానికి జరుగుచున్న హాని ఏమిటి? సమాజాన్ని వారు దోచుకుంటున్నారా? సమాజంలో ఇతరులకు అందాల్సిన వనరులుగాని, ప్రభుత్వ పథకాలుగని మోసపూరితంగా వారు దోచుకుంటున్నారా? వారే దోపిడీకి గురవుతున్నారా, కాదా? వారు హింసావాదులా? వారు చిన్నచూపు చూడబడడానికిగల కారణమేమిటి? వారి మానాన వారు బ్రతుకుతూ సమాజానికి ఎంతోకొంత మేలు మాత్రమే చేయుచున్న కులానికి సమాజము ఇచ్చే విలువ ఇంతేనా?
మత్స్యకారవృత్తిపై ఆధారపడి శ్రమగౌరవంతో బ్రతుకుతూ అందులోంచి బయటపడాలన్నా పడలేని అ.క్ష. సోదరులను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది విషయములను పరిశీలించవలసివున్నది.
కళింగదేశంలో బౌద్ధమతవ్యాప్తిపై ప్రస్తుతం పరిశోధన జరుపుతున్న పురావస్తుశాఖ విశాఖ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ - "అశోక చక్రవర్తి రెండో భార్య కళింగకు చెందిన మత్స్యకార కుటుంబీకురాలు ' కారువాక ' కావచ్చునని అంటూ మత్స్యకారుల్లో కోపం, హింస మొదలగు భావాలు తక్కువగా ఉంటాయన్నారు. (ఆంధ్రజ్యోతి 20-3-2010). వారివల్ల సమాజానికి ఎటువంటి హాని, ప్రమాదాలు, నష్టము జరగకపోగా వారిద్వారా ప్రజలకు పుష్టికరమైన ఆహారము అతి చౌకగా అందుతున్నది. 1947వ సం||ము దేశంలో మహా కరువు ఏర్పడినపుడు రాష్ట్రాలకు ఆహారధాన్యాలు సరఫరా చేయుటకు కేంద్రప్రభుత్వము ఏమిచేయాలో దిక్కుతోచక గాంధీజీని సలహా అడిగారట. అందుకు గాంధీ సముద్ర తీరప్రాంతవాస ప్రజలు మత్స్యాహారంతో జీవించవచ్చు. కనుక వారిని మినహాయించి మిగతా ప్రాంతాలకు ఆహారము అందునట్లు చూడమని సలహా ఇచ్చారట. ఆయన స్వయంగా శాకాహారి అయివుండి అటువంటి సలహా ఇవ్వడం ఆశ్చర్యకరమైనా మత్స్యాహారము విలువ ఎంతో అర్థం అవుతుంది. మత్స్యకారులనుండి ప్రభుత్వానికి ఏ ఇతర కులాలనుండి అందనంత ఆదాయము లభిస్తున్నది. ఏటా 11వేల కోట్ల రూపాయల విలువైన మత్స్య ఉత్పత్తులు రాష్ట్రానికి అందుతున్నవని చెప్పారు ముఖ్యమంత్రి. (ఆంధ్రజ్యోతి 13-9-2011). అది రాష్ట్రవార్షిక బడ్జెటులో సుమారు 8వ వంతు. రాష్ట్ర బడ్జెట్లో మత్స్యకారులకు ఖర్చుచేస్తున్నామని చెప్పారాయన. అంటే అది ప్రతి వంద రూపాయలలో కేవలము 54పైసలు అనగా 0.54శాతము. మిగిలిన 99రూ.46పైసలలో అధికభాగము ఇతర కులాలవారికి వినియోగింపబడుతున్నాయన్నమాట. ప్రజల ఆరోగ్యముపై దెబ్బతీసే వస్తూత్పత్తిదారులకు వారి ద్వారా ప్రభుత్వానికి వచ్చు ఆదాయంతో అనేక ఆర్థిక సదుపాయాలు, జీతభత్యాలు కల్పించి వారి సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తోడ్పడుచున్నది ప్రభుత్వం. ఆయా కులాలవారి బలమైన కులసంఘాలద్వారా అది సాధింపబడుచున్నది. అదే ప్రకారము ప్రాణాలే పెట్టుబడిగా దినదినగండం నూరేళ్ళాయుష్షుగా బ్రతుకుగాని బ్రతులీద్చుతూ, ప్రజలకు అతి చౌకగా పౌష్టికాహారమందించుచూ, ప్రభుత్వానికి వేలకోట్ల రూపాయలు ఆదాయము సమకూర్చి పెట్టుచూ ప్రతిఫలంగా సమాజములో హీనమైన గుర్తింపు పొందుతున్న మత్స్యకారులు వారు సంపాదించిపెట్టే ఆదాయమునుండి (మరలా) వారి ఆదాయమునుండి మాత్రమే వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందుటకు అవసరమైన ఆర్థిక సహాయము పొందాలి. ప్రస్తుతము వారు ప్రభుత్వానికి అందిస్తున్న ఆదాయమునుండి వారికి ప్రభుత్వము ఖర్చుపెడుతున్న 0.54%తో వారి సామాజిక, ఆర్థిక అభివౄద్ధి మాట దేవుడికెరుక, వారు సమాజంలో ఏ ఇతరకులానికిలేని హీనమైన గుర్తింపు మాత్రము గొప్ప రివార్డుగా (బహుమతిగా) పొందుచున్నారు. ఈ పద్ధతిని మార్చాలి.
ప్రస్తుతం మనకు కనబడుతున్న సామాజిక దృశ్యంలో అ.క్ష.ల యొక్క అధికారముగాని, పలుకుబడిగాని పరిమితమైయుండుటవల్ల వారు సరి అయిన, బలమైన ఆర్థిక సామర్థ్యమును సాధించి తద్వారా వారి వెనుకబాటుతనంనుండి బయటపడి సామాజిక మరియు విద్యాపరమైన అభివృద్ధి దిశగా ప్రయాణించలేక పోతున్నారు. దీనిని అధిగమించడనికి తగిన కృషి జరగాలి. కృషి అనేక కోణాలలో జరగాలి.
1. ప్రప్రథమంగా కులంలోని అతి ప్రజ్ఞాధురీణులను గుర్తించి వారితో తగు విధంగా ప్రవర్తించాలి.
2. సంఘంలో ఐకమత్యసాధనకు కృషి జరగాలి.
3. సంఘాభివృద్ధిని మనస్ఫూర్తిగా కాంక్షించే నిస్వార్థపరులను గుర్తించుటకు కృషి  జరగాలి.
4. బలమైన సంఘాన్ని స్థాపించి దానిని క్రియోన్ముఖంగా నడుపుటకు గట్టి కృషి జరగాలి. స్తబ్ధతకు చోటు ఇవ్వరాదు.
అగ్నికులక్షత్రియులు :
అగ్నికుల క్షత్రియులు ఏర్పడినప్పటినుండి వారిలో ఒకరైన పల్లవులు వారి సామంతరాజులైన సాలంకాయనులు, బృహత్పలాయనులు, ఆనందులు, విష్ణుకుండినులు - కళింగదేశ సరిహద్దుగా దక్షిణభారతదేశంలో రాజ్యపాలన్ చేస్తూ వ్యవసాయము, విదేశీనౌకా వ్యాపారాభివృద్ధి చేసి దూరస్థలములైన మలయా, జావా, సుమత్రా మొదలగు తూర్పుదీవులలోను, బర్మా, కాంబోడియా మొదలగు తూర్పుదేశాలలోను వలస రాజ్యాలు స్థాపించి ప్రాచీన ఆంధ్రదేశానికే కాక యావత్ భారతదేశానికి కూడ అత్యంత వైభవము, ఐశ్వర్యము, దిగంత విశ్రాంత కీర్తిని సంపాదించిపెట్టారు. విదేశీవాణిజ్యములోను, వలసరాజ్యస్థాపనలోను విశేషముగా కోరిక కలిగియుండియూ అనాగరికులైన విదేశస్తులతో వ్యాపారము చేయుచు ఈ కాలపు పాశ్చాత్యుల్లాగ క్రమక్రమముగ వారి రాజ్యమునుపహరించాలనిగాని, వారి స్వాతంత్ర్యమును మంటగలపాలనిగాని ప్రయత్నించలేదు. వారిని అనేక విధముల పీడించి మాత్ర్దేశమునకు అన్యాయార్జితమైన ఐశ్వర్యమును, అపయశస్సును ఏ మాత్రము చేకూర్చలేదు. ఇదీ పల్లవుల ఘనమైన చరిత్ర. అంతేగాని వారు ఏనాడూ జీవనంకొరకు మత్స్యకారులుగా ఉన్నట్లు దాఖలాలు లేవు. ఆంధ్రదేశమంలో వారి పతనానంతరము పల్లవులలో పాలకవర్గము వారిలో కొందరు కాంచీపురం రాజధానిగా దక్షిణ భారతదేశ పాలకులుగా కొనసాగగా ఆంధ్రదేశంలోని సామాన్య ప్రజానీకము అప్పటి వారి వారి వృత్తులను అవలంబించి ఉండవచ్చును లేదా కొందరు చరిత్రకారులు విశ్లేషించినట్లు శత్రుదాడిని ఎదుర్కోలేక పాలకవర్గము వారు అప్పటి వారి స్వస్థానమునుండి పారిపోయి వారి ఉనికిని మరుగుపరచుకొనుటకు సముద్రతీరవాసులతో కలిసిపోయి వారి వృత్తిని చేపట్టివుండవచ్చు. పల్లవులను  ఓడించిన చాళుక్యులు పల్లవుల సమూల నిర్మూలనే ధ్యేయంగా పోరాడినట్లు చరిత్ర వుంది.
అ.క్ష.ల ఏర్పాటు మెతక స్వభావులతో జరిగింది. (చూడు కరపత్రము-1). కనుక ఆ మెతకతనము వారిలో జీర్ణించుకుపోయి ఉదాసీనముగా వుంటారు. "పదాభితిష్త తపుషిమ్" - వేధించే వాడిని ఉక్కుపాదాలతో నలిపి పారేయి అనే ఋగ్వేద వాక్యమును మరిచిపోయి "మిత్రస్యాహం చక్షుషా సర్వాణి భూతాని సమీక్షే" - నేను సర్వప్రాణులను మిత్రదృష్టితో, ప్రేమభావంతో చూతునుగాక - అను యజుర్వేద వాక్యమును చక్కగా పాటిస్తారు. "మిత్రస్యమా చక్షుషా సర్వాణి భూతాని సమీక్షంతామ్" -  సర్వప్రాణులు నన్ను మిత్రదృష్టితో చూచునుగాక! - అను యజుర్వేద వాక్యమును ఆశిస్తారు. అ.క్ష.లలో వ్యవసాయము, నౌకానిర్మాణము, నౌకాయానము, వడ్రంగము, కమ్మరము మొదలైన పనులలో నిష్ణాతులైన వారు ఇప్పటికీ ఎందరో ఉన్నారు. నౌకానిర్మాణము, నౌకాయానము అ.క్ష.లకే ప్రత్యేకము. కనుక అ.క్ష.లందరూ మత్స్యకారులు కాదు. మత్స్యకారులందరూ అ.క్ష.లు కాదు. అందువలన అ.క్ష.లు తమను తాము పల్లీలమని, పల్లెకారులమని, మత్స్యకారులమని చెప్పుకోవడం, అలా పిలిపించుకోవడం సరైనదికాదు. మత్స్యకారులుకాని అ.క్ష.లకు ఇది చాలా బాధాకరమైన విషయము. అందుకే వారు కులానికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నవి. కనుక అ.క్ష.లు తమది కులవృత్తి ఆధారిత కులం కాదని, తాత్కాలికంగా ఆ వృత్తిలోవున్నవారు అవకాశం దొరికినపుడు వేరే వృత్తులలోకి మారుచున్నారని, సమాజానికి చాటిచెప్పాలి. జీవనాధారంగా ఏ వృత్తిచేపట్టినా అ.క్ష.లను పేరుకు సార్థకత కలుగు విధంగా జీవించి, సమాజంలో మంచి గుర్తింపు పొందాలి. పూర్వవైభవమును పునరుద్ధరించుకోవాలి. దీనివల్ల కేవలము వారికి సమాజంలోగల హీనమైన గుర్తింపులో ఏ కొంచెమైనా మార్పు కలుగుతుందేమోగాని వారి ఆర్థిక పరిస్థితిలో, అక్షరాస్యతలో అకస్మాత్తుగా ఎటువంటి అభివృద్దికి ఆస్కారము లేదు. అందుకు ప్రత్యేకంగా కృషి జరగాలి.
ఏది సాధించాలన్నా సంఘటిత శక్తి అవసరము. అందుకు ఒక బలమైన సంఘమును ఏర్పాటు చేసి కేవలము అ.క్ష.ల ఆత్మగౌరవము పెంచి, న్యూనతభావమునుండి బయటకుతెచ్చి అగ్రకులాలతో సమానస్థాయికి పెంచాలనే ఒకే ఒక్క సంకల్పంతో కృషి చేయాలి. సంకల్పము బలంగావుంటే సాధన మార్గాలు వాటంతట అవే సమకూరుతాయి. ప్రస్తుతం సమాజాన్ని శాసిస్తున్న మన రాష్ట్రంలోని కొన్ని కులాలవారు క్రీ.శ.1880-1910 మధ్యకాలంలోనే శాశ్వతప్రాతిపదికన బలమైన కులసంఘాలను ఏర్పరచుకొని ఇప్పటికీ విజయవంతముగా నడుపుకొనుచుండుట చూస్తున్నాము. అ.క్ష.ల్ కొరకు 1901లో ఏర్పడిన కులసంఘము నిర్వీర్యంగా ఉంది. అందువలన అ.క్ష.లు సంఘటితమై ప్రస్తుతము నడుస్తున్న సంఘాలకు అతీతంగాగాని, సంయుక్తంగాగాని ఒక బలమైన సంఘాన్ని శాశ్వతప్రాతిపదికన ఏర్పరచుకోవాలి.

సంఘ నిర్మాణము గురించిన వివరములు వేరుగా అందించబడును.

1, జులై 2012, ఆదివారం

కరపత్రము - 2


    చరిత్ర తెలియక విస్మృతికిలోనైన అమాయక అ.క్ష.లు తమ కులం పేరును పల్లెకారి అని చెప్తూ అది పల్లవ పదమునకు రూపాంతరమని వాదిస్తుంటారు. కాని పల్లవ అను పదమునకు పల్లెకారి అను పదమునకు పోలికే లేదు. ఈ పల్లెకారీనే పదము ఎట్లా ఏర్పడినదో ఎక్కడా చారిత్రకమైన ఆధారములు కనపడవు. కొందరు పళ్ళి అను పదమునకు మళయాళ భాషలోని రాజు అనే అర్థం తీసుకొని పల్లవులు రాజులు కనుక పల్లీలు అని పిలువబడినారు అంటారు. మళయాళంలోని పళ్ళి అంటే రాజు అన్న అర్థం పరిగణనలోకి తీసుకుంటే ఆ కాలంలో రాజ్యాలేలిన రాజవంశీకులందరూ పల్లీలు అని పిలువబడి ఉండాలి. కాని అది ఒక్క పల్లవ రాజ వంశీకులకే ఆపాదించబడింది. పైగా మళయాళ దేశమునేలిన కేరళులు అతి ప్రాచీనకాలమునుండియు పల్లవుల వలెనే స్వతంత్ర రాజులు. ఆ రెండు రాజవంశములు సమకాలీన వంశములు. మళయాళ భాషలోని పళ్ళి అను పదము పల్లిగా మారినదను వాదమును అంగీకరించుటకు పల్లవుల పాలన కాలంలో కేరళీయులకు, పల్లవులకుగల రాజకీయ సంబంధముగురించికాని, సామాజిక సంబంధ బాంధవ్యాల గురించిగాని, ఎక్కడో నైరుతి తీర ప్రాంతవాసులైన కేరళీయులు తూర్పుతీర ప్రాంతమునకు వలస వచ్చినట్లుగాగాని చారిత్రక ఆధారాలు కనిపించవు. అదే చాళుక్య, చోళ మైత్రి ఫలింతంగా ఆంధ్ర, తమిళ దేశాల మధ్య సంబంధబాంధవ్యాలు హెచ్చుగానే వుండేవని చారిత్రక ఆధారాలు కనిపించుచున్నవి. తెలుగు, తమిళ భాషలు ఒకే కూటమికి చెందినవి. రెండు భాషలలో కొన్ని అక్షరాల సామ్యము కూడ కనిపిస్తుంది. మళయాళంలోని పళ్ళి అను పదము పల్లి గా తీసుకుంటే మరి పల్లెకారి లేక పల్లికారి అనే పదము ఎట్లా ఏర్పడినదో అందులోని కారి అను అక్షరములు ఎందుకు కలిపారో, కారి అంటే అర్థమేమిటో ఎక్కడా వివరణ కనబడదు. ఒకవేళ విదేశీయులు కొన్ని నగరాలు, పట్టణాలు పేర్లు ఉచ్ఛారణను మార్చి వేరే వింధంగా అనగా... ఘంటసాల ను కొంటకొస్సలగాను, బందరు దగ్గర గూడూరుని కొడ్డూర అనియు, మోటుపల్లిని మోసలపురం అనియు పలికినట్లు పల్లెకారి అని వుంటారని చెప్పుటకు కూడా తగిన ఆధారాలు లేవు. దానికి మూలపదమేమిటో తెలియదు.
    ఈ పల్లెకారి అనే పదమే అ.క్ష.లకు సమాజంలో సరియైన విలువలు లేకుండా పోవడానికిగల ప్రధాన కారణం. పల్లెకారి అనగానే చేపలు పట్టుకునేవాడుగా చూడబడతాడు. అ.క్ష.లు ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన వారైనా ఈ పల్లెకారి అను పేరువల్ల సమాజంలో ఇతర బడుగు, బలహీన కులాలు, ఎటువంటి చారిత్రక నేపథ్యములేని కులాల వారికంటేకూడ చిన్నచూపు చూడబడతారు. కనుక అ.క్ష.లు తమను తాము కించపరుచుకొనే పల్లి అనిగాని పల్లెకారి అనిగాని చెప్పుకోవడంగాని, పిలిపించుకోవడంగాని సరైనది కాదు. ప్రభుత్వ ఉత్తర్వులలో కనిపించు పల్లి అను పేరు బెస్త, జాలరి, వాడబలిజ మొదలగు అనేక ఉపకులాల వలెనే ఒక ఉపకులమే అవుతుంది గాని అ.క్ష. కులమునకు మాత్రము పర్యాయపదంగా వర్తించదు.
    కనుక అ.క్ష. సోదర మహాశయులు తమ కులము పేరు చెప్పవలసినచోట పల్లెకారి అని కాకుండా అగ్నికుల క్షత్రియ అని చెప్పవలసినదిగా మనవి.


1. అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులా?
    కానే కాదు. కుల విభజనకు, కుల వౄత్తుల ఏర్పాటుకు మూలాధారంగా భావింపబడుచున్న అతి ప్రాచీన గ్రంథమైన మనుధర్మ శాస్త్రము 10 వ అ. 48 శ్లోకంలో మత్స్యఘాతో నిషాదానాం... నిషాదులకు చేపలు పట్టుట వృత్తి... అని చెప్పబడి ఉన్నది. అంతేకాని అది ఏ కులానికీ కుల వృత్తిగా ఆపాదింపబడలేదు.
    అ.క్ష.లుగాక ఏ ఇతర కులాన్ని పరిశీలించినా సమాజానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తిగాని, సేవా వృత్తులలో ఏదో ఒక వృత్తిలోగాని స్థిరపడి అందులోనే నిష్ణాతులై దానినే వారి వంశపరంపర కులవృత్తిగా చేసుకున్నారు. అటువంటి ఏ కులవృత్తికైనా ఆ కులములోని వారే అర్హులుగాని ఇతరులెవరూ ప్రవేశార్హులుకారు. ప్రాచీనకాలమునుండి వంశపరంపరకు సంబందములేని బహువృత్తినిపుణులు కలిగిన కులము అగ్నికుల క్షత్రియ కులము ఒక్కటే కనిపిస్తుంది. అందులో ప్రధానమైన వృత్తులు వ్యవసాయం, నౌకానిర్మాణం, నౌకాయానము... వాటికి అనుబంధమైన వడ్రంగము, కమ్మరము మొదలగు వృత్తులలో నిపుణులైనవారు అ.క్ష.లలో ఎందరో ఉన్నారు. వీటిలో నౌకానిర్మాణము, దానికి సంబంధించిన వడ్రంగం, నౌకాయానము అ.క్ష.లకే ప్రత్యేకము. ఏకొద్దిమందో పై వృత్తులనేర్పరచుకునే ఆర్థికస్థోమత లేని వారు, నిరక్షరాస్యులు వారి జీవనభౄతికొరకు మత్స్యకార వృత్తిని చేపట్టి ఉండవచ్చు. అంతమాత్రంచేత అ.క్ష.లందరూ వారు ఏ వృత్తిలో ఉన్నా మత్స్యకారులేనని, మత్స్యకారులందరూ అ.క్ష.లేననడం మాత్రము సహించరానిది. అట్లా అనినవారికి తగు విధంగా గుణపాఠం చెప్పాలి. మత్స్యకార వృత్తి అ.క్ష. కులమునకు కులవృత్తి కాదు. ఈ మత్స్యపరిశ్రమలో కొన్ని అగ్రకులాల వారితో సహా అనేక కులాలవారు, వారి కులవృత్తికి అనుబంధంగా ఈ వృత్తిని చేపట్టిన వారు ఉన్నారు. వారిని మత్స్యకారులు అనరు. ఆ వృత్తితో ఏ కాలంలోనూ, ఏటువంటి సంబంధము లేకుండా ఇతర వృత్తులలో, ఉద్యోగాలలో స్థిరపడి పట్టణాల్లో, నగరాల్లో, విదేశాల్లో నివసించుచూ ఆర్థికాభివౄద్ధి సాధించి గౌరవప్రదంగా జీవించుచున్న అ.క్ష.లు అధికశాతంలో ఉన్నారు. కులం పేరు పల్లెకారి అని చెప్పడంలో అ.క్ష.లు అధికసంఖ్యలో ఆత్మన్యూనతకు లోనై కులం పేరును మార్చుకునో, ఇంటిపేరుని వీలైన చోటల్లా మార్చుకునో వేరే కులస్తులుగా పరిగణనలోకి వస్తున్నారు. దానివల్ల కుల అస్తిత్వానికే భంగము వాటిల్లే ప్రమాదముంది.
    కనుక అ.క్ష. సోదరులందరూ పై వివరణ దౄష్ట్యా దయచేసి కులమునకుగల పల్లి, పల్లికారి అను పేరును వీడి ఇకముందు కులం పేరును చెప్పవలసినచోటల్లా `అగ్నికుల క్షత్రియా అని చెప్పుకొని, అదే పేరుతో చలామణిలోకి వచ్చి కులమునకు పూర్వవైభవమును పునరుద్ధరించుకొనుటకు కృషి చేపట్టవలసినదిగా మనవి.
    దీనివల్ల అ.క్ష.ల సామాజిక గుర్తింపు ఏ కొంచెము మార్పు అయినా సంభవించి వారు ఆత్మన్యూనతనుండి బయటపడవచ్చునేమోగాని వారు చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలోగాని, వారి ఆర్థికస్థితిలోగాని అకస్మాత్తుగా ఏటువంటి మార్పుకు ఆస్కారము లేదు. కనుక ప్రస్తుతం ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధికి కల్పించుచున్న ఆర్థిక మరియు రిజర్వేషన్ మొదలగు సంక్షేమ పథకాలు అ.క్ష.లకు అందవేమోననే అనుమానం లేకుండా తమ ఔన్నత్యాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేయవలసినదిగా కోరుకుందాము. ప్రస్తుతము ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అగ్నికుల క్షత్రియ అను పేరు మీదనే ప్రభుత్వము కల్పించు సదుపాయములు అమలు జరుగుచున్నవి కనుక ఈ విషయంలో అనుమానము అవసరములేదు.


సంఘటితశక్తికి ఏ లోకంలోనూ తిరుగులేదు. ఆ శక్తి మనకు కావాలి.
ఒకే జాతి, ఒకే మూలముయొక్క మనము ఒకే గమ్యమువైపు నడుద్దాము.
గమనిక : ఈ కరపత్రాన్ని పదిమందితో చదివించే ప్రయత్నం చేయండి.
కరపత్రము-1


అగ్నికుల క్షత్రియ సోదర మహాశయులకు విజ్ఞప్తి
    మన జాతి నేడు దైవయోగము వలన తమ ప్రాచీన వైభవమును కోల్పోయి జీవకళ లేకుండా ఉన్నది. కొంతకాలము నుండి మన జాతి పూర్వచరిత్రను విస్మరించి ఉన్నది. మనకు ఎంతో గర్వింపదగిన చరిత్రము వుండి కూడ ఇంతవరకు చరిత్రలేని జాతివలె మన పూర్వ తేజస్సును మరచుట భావ్యము కాదు.
    గతాన్ని విస్మరించి సమాజంలో అణగారియుండి చిన్నచూపు చూడబడుచున్న అగ్నికుల క్షత్రియు (అ.క్ష.)ల మూలములు, వారి వారసత్వము, చారిత్రక నేపథ్యము, కులముయొక్క విశిష్ఠత ప్రతి అ..క్ష.తెలుసుకోవలిసి వుంది. అ.క్ష. ఏర్పడిన కాలము, ఏర్పడిన విధానము, వారి పూర్వపు ఔన్నత్యమును గురించి ప్రతివారు తెలుసుకోవాలి.
    వాస్తవము కల్పితముకంటే అద్భుతముగా ఉంటుంది.
    అగ్నికుల క్షత్రియ అనే కులము వంశపరంపరగా వచ్చిన కుల వౄత్తి ఆధారంగా ఏర్పడిన ప్రాచీన ఆదిమ కులాల్లో ఒక కులం కాదు. అది క్రీస్తుకు పూర్వము సుమారు 400 సంవత్సరముల క్రిందట కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భారతదేశ రక్షణ నిమిత్తం ఏర్పరచబడిన కులము. ఆ కులము పేరును తమకు అర్హత లేని గొప్పతనాన్ని ఆపాదించుకొనుటకుగాను ఎవరో కొద్దిమంది ఏర్పరుచుకున్న పేరు కాదు. దానికి వైభవోపేతమైన గత చరిత్ర ఎంతో ఉంది. అటువంటి ఉన్నత విలువలు గల కులము యొక్క అస్తిత్వము నేడు ప్రశ్నార్థకమైనది. అ.క్ష.ల యొక్క పూర్వవైభవమును తెలియజేయు కొన్ని చారిత్రక సత్యములు ఈ క్రింద ఇవ్వబడినవి....


1. అగ్ని కుల క్షత్రియుల యొక్క పుట్టుక :-
    ప్రముఖ దేశీయ చారిత్రక పరిశోధకులైన శ్రీ కోట వెంకటాచలం గారు రచించిన `అగ్ని కుల క్షత్రియులు లేక బ్రహ్మక్షత్రులూ అను గ్రంథమునందు ఈ క్రింది విధముగా వ్రాశారు...
    `... ఆంధ్ర శాతవాహన వంశము అనేక భాగములై దేశములో అల్ప రాజ్యములు స్థాపించి ఎవరికి వారు స్వతంత్రులుగానుండిరి. వాయవ్య భారతదేశమున శక, హూణ, ఘార్జరాది విదేశీజాతులవారు అల్ప రాజ్యములకు ప్రభువులైయుండి అవకాశము దొరికినపుడెల్లను దేశమును కొల్లగొట్టుచు, స్త్రీ, బాల, వౄద్ధులను సైతము హింసించుచుండిరి. అల్ప రాజ్యములను ఏకం చేసి నాయకత్వం వహించి పరదేశీయుల దాడినుండి దేశమును రక్షించగల చక్రవర్తిత్వము లేకపోయినది. దేశము అరాచకముగనున్నట్లేర్పడెను. ఆ సమయంలో హిందూరాజులు పీఠాధిపులకు శిష్యులై ధర్మయుక్తముగా పాలించుచుండిరి. ఇట్టి స్థితిలో పీఠాధిపులు బ్రాహ్మణరాజ వంశములనుండి వీరులగు నాలుగు కుటుంబముల వారినేరి వారియందు బ్రహ్మతేజస్సును, క్షాత్రతేజస్సును నిలుచునట్లు సంకల్పించి వేద మంత్రములచే అగ్నినుపాసింపజేసి వారి చేత హోమాదులు చేయించి దేశమును నాలుగు భాగములుగానొనర్చి వారు నలుగురిని ఆయా భాగములకు అథినాధులుగానొనర్చిరి. ఈ నాలుగు వంశముల వారును అగ్ని కుల క్షత్రియులు అని పిలువబడిరి. అగ్నికులమనగా అగ్నిదేవుని వంశమునకు చెందినవారు. అగ్ని - దేవతలలో బ్రాహ్మణుడు. అగ్నికులమన బ్రాహ్మణ వర్ణము. బ్రాహ్మణ వర్ణమందు పుట్టి క్షాత్రమవలంబించిన వాడు అగ్ని కుల క్షత్రియుడు అని బ్రహ్మ క్షత్రుడు అని పిలవబడెను....' అని వ్రాశారు.
    మరొక ప్రముఖ దేశీయ చరిత్ర పరిశోధకులైన శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు పంతులు గారు రచించిన `చాళుక్యులు దాక్షిణాత్యులే' అను పరిశోధన వ్యాసమందు ఉత్తర దేశమునందలి సోళంకులు అగ్ని కుల క్షత్రియులని, సూర్య, చంద్ర వంశములే గాక అగ్నివంశమనునది కూడ కలదని వ్రాశారు. ఆయన `.... ఉత్తర దేశమునందలి చాళుక్యులు అనగా సోళంకులు తాము అగ్నికుల.క్షత్రియులమని  చెప్పుకొనసాగిరని, పవార్ (ప్రమార), పరిహారీ (ప్రతిహారీ), చౌహాన్ (చాహుమాన), సోళంకి (చాళుక్య) - ఈ నాలుగు క్షత్రియ జాతులను అ.క్ష.లని రాజపుత్ర స్థానమందనియెదరు...' అని కూడా వ్రాశారు.
    పై రెండు వ్యాసములను పరిశీలించినయెడల - మొదటి వ్యాసములో అగ్నికుల క్షత్రియ అను పేరు ఏర్పడిన విధము, ఏర్పడిన కాలము, దేశము నాలుగు చెరగులా అ.క్ష. రాజవంశములవారు పరిపాలించిన విషయము తెలియుచున్నది. రెండవ వ్యాసములో అగ్నికులము అనునది చాళుక్యులకు పూర్వకాలమునందే ఉన్నదనియు, ఉత్తర హిందూదేశము పాలించిన రాజులు కూడ అ.క్ష.లేనని నిర్ధారణమవుచున్నది.
    ఈ విధముగా చారిత్రక పరిశోధకులు అ.క్ష.లు ఏర్పడిన కాలము, ఏర్పడిన సందర్భమును గురించి ఏకాభిప్రాయము వెలిబుచ్చారు. అ.క్ష. కులము ఈ మధ్య కాలములో దేశ రక్షణ కొరకు ప్రత్యేకముగా ఏర్పరచబడిన కులము అనేది వాస్తవము.


2. నేటి అ..క్ష.లు ఆనాటి అ.క్ష.లైన పల్లవ వంశీకులా?
    `అవునూ అనేదే దీనికి సమాధానము.
    హోమాదుల ద్వారా బ్రహ్మ తేజస్సును, క్షాత్ర తేజస్సును నింపబడిన నలుగురు బ్రాహ్మణ రాజ వంశీకులు దేశము నాలుగు భాగములకు అధినాధులుగా చేయబడినారు కదా! ఆ నలుగురు తమతోజేరి తమ నాయకత్వము అంగీకరించిన సామంతరాజులతో కలసి దేశమునకు ఎట్టి బాధయూ కలగకుండా కాపాడగలిగారు. చాళుక్యులు, పల్లవులు, కదంబ, చేడ మొదలగు రాజవంశముల వారు ఆ విధముగా నియమింపబడినవారు. వారిలో పల్లవులు శాతవాహనులకు సామంతరాజులుగా ఉన్నారు. పల్లవులు బ్రాహ్మణులని చరిత్ర చెబుతున్నది. (పే. 52 ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర)
    ఆంధ్రమహాసామ్రాజ్యము అంతరించిన తర్వాత అప్పటి వరకు శాతవాహనులకు సామంత రాజులుగానుండిన పల్లవులు స్వతంత్రులై క్రీ.శ.200 నుండి క్రీ.శ.700 వరకు కౄష్ణానదికి దక్షిణాన ఉన్న ఆంధ్రదేశాన్ని కాంచీపురమును రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వీరి పరిపాలన కాలంలో తూర్పుసముద్ర తీరమునుండి ఆంధ్రులు అత్యంత సాహసధైర్యములతో స్వదేశమును వదలి అతి దూరస్థలములగు జావా, సుమత్రా, మలయా ద్వీపములకును, బర్మా, సయాం, కాంబోడియా మొదలగు తూర్పుదేశములకు వాణిజ్య వాంఛతో వలసపోయి, ఆయా దేశములను జయించి వలస రాజ్యములను ఏర్పరుచుకొని ఆంధ్రదేశమునకే కాక యావద్భారతదేశానికి కూడ దిగంత, విశ్రాంత కీర్తిని సంపాదించియున్నారు. శాతవాహనుల కాలంలో నౌకాయానమునకు పల్లవులు అధిక ప్రాధాన్యతను ఇచ్చి అభివౄద్దీ పరిచారు. అప్పుడు ప్రారంభమైన నౌకా నిర్మాణము, దేశీయ విదేశీయ నౌకా యానము, నౌకా వాణిజ్యము ఆంధ్రదేశంలో పల్లవ వంశపాలన అంతరించిన తర్వాత ఈ మధ్యకాలం వరకు అ.క్ష.ల అధీనములోనే కొనసాగినది అనే విషయం జగద్విదితం.
    శాతవాహనులు బౌద్ధమతమును స్వీకరించి ఆ మతమును పోషించి అభివౄద్ధి పరచగా వారికి సామంతులుగా ఉన్న పల్లవులు మాత్రము బ్రాహ్మణ మతాభిమానులై హిందూమతాభివౄద్ధికి కౄషిచేశారు. ఆ సందర్భంలో హిందుదేవాలయ నిర్మాణ వ్యవస్థ ప్రారంభమైనది. అప్పటివరకు వేదసంస్కౄతిలో విగ్రహారాధన లేదు. దేవాలయ వ్యవస్థ లేదు. దేవాలయ వ్యవస్థకు ఆద్యులు పల్లవులే. అటువంటి హిందూదేవాలయ వ్యవస్థ ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో అ.క్ష.ల ఆధీనంలోనే వారే పూజారులుగా కూడ నడుస్తూ ఉంది. నెల్లూరు, గూడూరులలోని ద్రౌపది, ధర్మరాజు దేవాలయాలు ఇందుకు ఉదాహరణ. ఇటీవల అనగా 28-4-2009 న మతమార్పిడుల నిరోధానికి దేశవ్యాప్త శోభాయాత్రలు తలపెట్టిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ హిందూ దేవాలయ వ్యవస్థకు కులాలతోగల సంబంధమును గురించి వివరించుతూ `...ఆలయాలు నిర్మాణం చేసే పని అగ్నికుల క్షత్రియులదీ అని చెప్పారు. (ఆంధ్రజ్యోతి 29-4-2009). కీ.శే. సత్యలింగం నాయకర్, కీ.శే. కొపనాతి కౄష్ణమ్మగారు, పినపోతు గజేంద్రుడుగారు, కీ.శే. పెదసింగు స్వామి గారు మొదలగు అ.క్ష.లు ఆలయనిర్మాణం చేయడంకాని, ధ్వజస్థంభములెత్తడంగాని చేసిన ప్రముఖులలో కొందరు. ఈ విధముగా పల్లవుల కాలంలో ప్రారంభింపబడి వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవైశ్వర్యములతో కొనసాగిన దేశీయ విదేశీయ నౌకాయానము ఈ మధ్య కాలం వరకు అ.క్ష.ల అధీనంలోనే కొనసాగియుండడము, అప్పటి దేవాలయ వ్యవస్థ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ అ.క్ష.ల అధీనంలోనె కొనసాగుచుండడం గమనించితే నేటి అ.క్ష.లు పల్లవ వంశీకులమని చెప్పుకోవడానికి సందేహింపనవసరంలేదు.