కరపత్రము - 3
"సంఘేశక్తిః కలౌయుగే"
(కలియుగంలో సంఘానిదే శక్తి)
అగ్నికులక్షత్రియ సోదర మహాశయులకు,
అ.క్ష.లు తాము సమాజంలో చిన్నచూపు చూడబడుచున్నామని, అణచివేతకు గురవుతున్నామని పదే పదే బాధపడుతుంటారు. పేదవాని కోపం పెదవికి చేటు అన్నట్లు ఉంటారేగాని అణచివేతను ఎదుర్కొనే ప్రయత్నమేదీ చేయరు. మౌనము అంగీకారము అవుతుంది. స్వాతంత్రానంతరము చైతన్యవంతులై ప్రభుత్వ రక్షణతో కులదూషణను ఎదుర్కొంటున్నవారు సైతము వీరిని చిన్నచూపు చూస్తుంటారు.
అ.క్ష.లను సమాజం తేలికగా చూచుటకు, వారు కూడ అమాయకత్వంతోనో, అబలత్వంతోనో, ఆత్మన్యూనతకు గురి అగుటకుగల కారణము, తమ కులాన్నిఅ.క్ష.లని వారే చెప్పుకోకపోవడానికి, కుల దూషణను ఎదుర్కోలేకపోవుటకు గల కారణము అన్వేషించి తొలగించవలసివుంది. కేవలము అ.క్ష.లలో కొంతమందికి తమ జీవనాధారంగా చేపట్టిన మత్స్యకారవృత్తి మాత్రమే అందుకు కారణంగా కనబడదు. అనేక ఇతర కారణాలలో అది కూడా ఒకటి కావచ్చు. ఎందుకనగా ఆ వృత్తి, వారికి పేటెంట్ కాదు. మత్స్యకారవృత్తిలో, మత్స్యకార్మికులలో అసలు మొత్తము మత్స్యపరిశ్రమలోనే అనేక కులాలవారు ఉన్నారు. అనేక అగ్రకులాలవారు ధనార్జనకు మత్స్యపెంపకము చేపట్టి, చెరువులు తవ్వించుకొని మత్స్యవ్యాపారము చేయుచున్నారు. కేవలం కొన్ని వందల సంవత్సరముల క్రిందట (అనగా 12, 13 వందల సం||ల క్రిందట) క్లిష్ట పరిస్థితుల్లో జీవనాధారంగా మత్స్యకారవృత్తి చేపట్టిన అ.క్ష.లలో కొందరు కూడ అటువంటివారే. ఇన్ని వందల సం||లుగా ఆ వృత్తిలోనించి బయటపడే దిక్కు లేనివారు అందులోనే స్థిరపడిపోయి కొనసాగుచుండవచ్చు. అంతమాత్రాన ఆవృత్తిమీద ఆధారపడిన ఇతర కులాల వారికిలేని న్యూనతాభావము అ.క్ష.లకు ఎందుకుండాలి?
అ.క్ష.లను సమాజము చిన్నచూపు చూడటానికి వారే కారణము. తమ ఔన్నత్యాన్ని తామే మరచిపోయి ఆదిమవాసులైన మత్స్యకారులలో కలిసిపోయివందల సం||లు గడిచిపోవుటవల్ల వారు కేవలము మత్స్యకారులేనని భావించడమే అందుకు కారణం. ఆ భావననుండి బయటకు తేవటానికి గట్టి కృషి జరగాలి. ఇక్కడ స్వామి వివేకానంద తరచుగా చెప్పిన ఒక కథ గుర్తుచేయాలి. ఇది అందరకు తెలిసిన కథే అయినందువల్ల క్లుప్తంగా.....
నిండు గర్భంతో ఉన్న సింహము ఒకటి గొర్రెల మందపై దూకింది. పొరపాటున క్రిందపడుటవల్ల గర్భవిచ్ఛిత్తి జరిగి ఒక పిల్లను కని చనిపోయింది. ఆ
పిల్ల గొర్రెలతోపాటే పెరిగిపెద్దదైంది. అన్నీ గొర్రె లక్షణాలే వచ్చాయి. గొర్రెల్లా అరవడం, తినడం చేస్తూండేది. ఒకరోజు మరో సింహము ఆ మందపై
దాడి చేసింది. గొర్రెలతోపాటే ఉన్న సింహంపిల్ల కూడా పరుగు లంకించుకుంది. దాన్ని చూచి ఆశ్చర్యపోయిన సింహం దాని జూలు పట్టుకొని దాన్ని ఒక నీటిమడుగువద్దకు తీసుకువెళ్ళి దాని నిజస్వరూపం చూపించి దాని జాతిని గుర్తుచేసింది. అప్పటినుండి గొర్రెలాగ పెరిగిన సింహంపిల్ల నిజమైనసింహంగా మారింది.
అదేవిధంగా 12, 13వందల సం||ల క్రిందట మాత్రమే అప్పటి క్లిష్టపరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులుగా మారిన అ.క్ష.లలో కొందరు కాలక్రమేణా వారి నిజస్వరూపమును మరచిపోయి మత్స్యకారులతో కలసి బ్రతుకుతూ తమ కులం పేరు చెప్పవలసినచోట 'అగ్నికులక్షత్రియ ' బదులు పల్లెకారి అని చెప్పడమే వారి ఆత్మన్యూనతకు నాంది. వారి నిజస్వరూపం వారికి గుర్తుచేయాలి. అ.క్ష.లు కానివారు బెస్త, జాలరి, వాడబలిజ, పల్లి, గంగవార్, గంగ పుత్ర మొదలగు అనేక కులాలవారు ఉన్నారు. అవి వేర్వేరు కులాల పేర్లు. వారి ఆర్థిక స్థితిగతులనుబట్టి వారి ఆర్థికాభివృద్ధి అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వము వారి వృత్తి ఆధారంగా బి.సి.లలో ఉన్న అన్ని కులాల వారికంటే కూడ ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వారిగా గుర్తించి బి.సి.-ఎ(1)లో చేర్చింది. ఈ వృత్తిమీద ఆధారపడి బ్రతికేవారు బి.సి.-ఎ(1) లోని కులాలవారే కాక ఇతర బి.సి. కులాలు వారు అనేక మందితోపాటు వీరి ఆర్థికావసరాలు తీర్చే దళారివర్గంవారు కూడా ఉన్నారు. వారే మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి గండి కొట్టి వారు అభివృద్ధి చెందుతున్నారు. ఈ వృత్తిదారులలో అనేకమంది మధ్యదళారులకు సహాయకారులుగా ఉండి వారి సంపాదనంతా దళారులకు దోచిపెట్టి వారి దయాదాక్షిణ్యాలపై బ్రతుకుతున్నారు. ఇది ప్రభుత్వమువారు కూడా గుర్తించి ఆందోళన వ్యక్తపరిచిన విషయము ఆంధ్రజ్యోతి 10-7-2010న ప్రచురించింది.
అ.క్ష.లకు ఘనమైన ప్రాచీన చరిత్ర ఉంది. (చూడు. కరపత్రం 1, 2). చరిత్ర గురించి పూర్తిగా తెలియని వారే కులం పేరు చెప్పవలసిన చోట పైన చెప్పబడిన కులాల్లో ఏ పేరునూ చెప్పకుండా, ఠక్కున ఏ చారిత్రక ఆధారము లేని పల్లెకారి అని చెబుతారు. వారి దృష్తిలో పల్లెకారి అంటే పల్లవులు అను పేరుకు రూపాంతరమని, అది చాలా గొప్ప కులమని భావన్ ఉంది. కాని సమాజం దృష్టిలో పల్లెకారి అంటే పై కులాలలోని పల్లి అనీ వారు కేవలము బెస్త, జాలరి మొదలగు కులాలవంటి చేపలోళ్ళేననే భావన ఉంటుంది. తాతముత్తాతల నాటి నుండి మత్స్యకారవృత్తితో ఎటువంటి సంబంధంలేకుండా సమాజంలో మంచి గౌరవం పొందుతున్నవారు, వ్యక్తిగా ఎంతో విలువపొందినవారు వారి కులం పల్లెకారి అని చెప్పగానే అప్పటివరకు వారికి ఉన్న విలువ, గౌరవం ఒక్కసారిగా మారిపోతుంది. వీడు చేపలు పట్టుకునే కులం వాడా! అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తర్వాత సంబోధన మారిపోతుంది. అంతెందుకు - స్వకులంలోనివారే కొందరు స్వయంకల్పిత రాజు కులమని చెప్పుకుంటూ, మరికొందరు మార్చుకున్న ఇంటిపేర్లుబట్టి వేరే కులస్తులుగా చెలామణి అవుతూ పల్లెకారి అని చెప్పుకునే తోటి కులస్తుణ్ణి హీనంగా చూస్తారు. వారిలో మైదానప్రాంతవాసులు , తీరప్రాంతవాసులతో సంబంధబంధవ్యాలు కూడా అరుదుగా మాత్రమే జరుగుతాయి. కొందరైతే అటువంటి వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తారు. వీరి చర్య మాత్రము ఇతర కులాల వారికివలె చాటుమాటుగా కాకుండా బాహాటంగానే ఉంటుంది. మున్ముందు ఇటువంటి వారిని సంస్కరించాలి.
ఇలా ఎందుకు జరుగుచున్నది? దీనికి కారణమేమిటి? మత్స్యకారవృత్తి అంత హీనమైనదా? మత్స్యకారులవల్ల సమాజానికి జరుగుచున్న హాని ఏమిటి? సమాజాన్ని వారు దోచుకుంటున్నారా? సమాజంలో ఇతరులకు అందాల్సిన వనరులుగాని, ప్రభుత్వ పథకాలుగని మోసపూరితంగా వారు దోచుకుంటున్నారా? వారే దోపిడీకి గురవుతున్నారా, కాదా? వారు హింసావాదులా? వారు చిన్నచూపు చూడబడడానికిగల కారణమేమిటి? వారి మానాన వారు బ్రతుకుతూ సమాజానికి ఎంతోకొంత మేలు మాత్రమే చేయుచున్న కులానికి సమాజము ఇచ్చే విలువ ఇంతేనా?
మత్స్యకారవృత్తిపై ఆధారపడి శ్రమగౌరవంతో బ్రతుకుతూ అందులోంచి బయటపడాలన్నా పడలేని అ.క్ష. సోదరులను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది విషయములను పరిశీలించవలసివున్నది.
కళింగదేశంలో బౌద్ధమతవ్యాప్తిపై ప్రస్తుతం పరిశోధన జరుపుతున్న పురావస్తుశాఖ విశాఖ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ - "అశోక చక్రవర్తి రెండో భార్య కళింగకు చెందిన మత్స్యకార కుటుంబీకురాలు ' కారువాక ' కావచ్చునని అంటూ మత్స్యకారుల్లో కోపం, హింస మొదలగు భావాలు తక్కువగా ఉంటాయన్నారు. (ఆంధ్రజ్యోతి 20-3-2010). వారివల్ల సమాజానికి ఎటువంటి హాని, ప్రమాదాలు, నష్టము జరగకపోగా వారిద్వారా ప్రజలకు పుష్టికరమైన ఆహారము అతి చౌకగా అందుతున్నది. 1947వ సం||ము దేశంలో మహా కరువు ఏర్పడినపుడు రాష్ట్రాలకు ఆహారధాన్యాలు సరఫరా చేయుటకు కేంద్రప్రభుత్వము ఏమిచేయాలో దిక్కుతోచక గాంధీజీని సలహా అడిగారట. అందుకు గాంధీ సముద్ర తీరప్రాంతవాస ప్రజలు మత్స్యాహారంతో జీవించవచ్చు. కనుక వారిని మినహాయించి మిగతా ప్రాంతాలకు ఆహారము అందునట్లు చూడమని సలహా ఇచ్చారట. ఆయన స్వయంగా శాకాహారి అయివుండి అటువంటి సలహా ఇవ్వడం ఆశ్చర్యకరమైనా మత్స్యాహారము విలువ ఎంతో అర్థం అవుతుంది. మత్స్యకారులనుండి ప్రభుత్వానికి ఏ ఇతర కులాలనుండి అందనంత ఆదాయము లభిస్తున్నది. ఏటా 11వేల కోట్ల రూపాయల విలువైన మత్స్య ఉత్పత్తులు రాష్ట్రానికి అందుతున్నవని చెప్పారు ముఖ్యమంత్రి. (ఆంధ్రజ్యోతి 13-9-2011). అది రాష్ట్రవార్షిక బడ్జెటులో సుమారు 8వ వంతు. రాష్ట్ర బడ్జెట్లో మత్స్యకారులకు ఖర్చుచేస్తున్నామని చెప్పారాయన. అంటే అది ప్రతి వంద రూపాయలలో కేవలము 54పైసలు అనగా 0.54శాతము. మిగిలిన 99రూ.46పైసలలో అధికభాగము ఇతర కులాలవారికి వినియోగింపబడుతున్నాయన్నమాట. ప్రజల ఆరోగ్యముపై దెబ్బతీసే వస్తూత్పత్తిదారులకు వారి ద్వారా ప్రభుత్వానికి వచ్చు ఆదాయంతో అనేక ఆర్థిక సదుపాయాలు, జీతభత్యాలు కల్పించి వారి సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తోడ్పడుచున్నది ప్రభుత్వం. ఆయా కులాలవారి బలమైన కులసంఘాలద్వారా అది సాధింపబడుచున్నది. అదే ప్రకారము ప్రాణాలే పెట్టుబడిగా దినదినగండం నూరేళ్ళాయుష్షుగా బ్రతుకుగాని బ్రతులీద్చుతూ, ప్రజలకు అతి చౌకగా పౌష్టికాహారమందించుచూ, ప్రభుత్వానికి వేలకోట్ల రూపాయలు ఆదాయము సమకూర్చి పెట్టుచూ ప్రతిఫలంగా సమాజములో హీనమైన గుర్తింపు పొందుతున్న మత్స్యకారులు వారు సంపాదించిపెట్టే ఆదాయమునుండి (మరలా) వారి ఆదాయమునుండి మాత్రమే వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందుటకు అవసరమైన ఆర్థిక సహాయము పొందాలి. ప్రస్తుతము వారు ప్రభుత్వానికి అందిస్తున్న ఆదాయమునుండి వారికి ప్రభుత్వము ఖర్చుపెడుతున్న 0.54%తో వారి సామాజిక, ఆర్థిక అభివౄద్ధి మాట దేవుడికెరుక, వారు సమాజంలో ఏ ఇతరకులానికిలేని హీనమైన గుర్తింపు మాత్రము గొప్ప రివార్డుగా (బహుమతిగా) పొందుచున్నారు. ఈ పద్ధతిని మార్చాలి.
ప్రస్తుతం మనకు కనబడుతున్న సామాజిక దృశ్యంలో అ.క్ష.ల యొక్క అధికారముగాని, పలుకుబడిగాని పరిమితమైయుండుటవల్ల వారు సరి అయిన, బలమైన ఆర్థిక సామర్థ్యమును సాధించి తద్వారా వారి వెనుకబాటుతనంనుండి బయటపడి సామాజిక మరియు విద్యాపరమైన అభివృద్ధి దిశగా ప్రయాణించలేక పోతున్నారు. దీనిని అధిగమించడనికి తగిన కృషి జరగాలి. కృషి అనేక కోణాలలో జరగాలి.
1. ప్రప్రథమంగా కులంలోని అతి ప్రజ్ఞాధురీణులను గుర్తించి వారితో తగు విధంగా ప్రవర్తించాలి.
2. సంఘంలో ఐకమత్యసాధనకు కృషి జరగాలి.
3. సంఘాభివృద్ధిని మనస్ఫూర్తిగా కాంక్షించే నిస్వార్థపరులను గుర్తించుటకు కృషి జరగాలి.
4. బలమైన సంఘాన్ని స్థాపించి దానిని క్రియోన్ముఖంగా నడుపుటకు గట్టి కృషి జరగాలి. స్తబ్ధతకు చోటు ఇవ్వరాదు.
అగ్నికులక్షత్రియులు :
అగ్నికుల క్షత్రియులు ఏర్పడినప్పటినుండి వారిలో ఒకరైన పల్లవులు వారి సామంతరాజులైన సాలంకాయనులు, బృహత్పలాయనులు, ఆనందులు, విష్ణుకుండినులు - కళింగదేశ సరిహద్దుగా దక్షిణభారతదేశంలో రాజ్యపాలన్ చేస్తూ వ్యవసాయము, విదేశీనౌకా వ్యాపారాభివృద్ధి చేసి దూరస్థలములైన మలయా, జావా, సుమత్రా మొదలగు తూర్పుదీవులలోను, బర్మా, కాంబోడియా మొదలగు తూర్పుదేశాలలోను వలస రాజ్యాలు స్థాపించి ప్రాచీన ఆంధ్రదేశానికే కాక యావత్ భారతదేశానికి కూడ అత్యంత వైభవము, ఐశ్వర్యము, దిగంత విశ్రాంత కీర్తిని సంపాదించిపెట్టారు. విదేశీవాణిజ్యములోను, వలసరాజ్యస్థాపనలోను విశేషముగా కోరిక కలిగియుండియూ అనాగరికులైన విదేశస్తులతో వ్యాపారము చేయుచు ఈ కాలపు పాశ్చాత్యుల్లాగ క్రమక్రమముగ వారి రాజ్యమునుపహరించాలనిగాని, వారి స్వాతంత్ర్యమును మంటగలపాలనిగాని ప్రయత్నించలేదు. వారిని అనేక విధముల పీడించి మాత్ర్దేశమునకు అన్యాయార్జితమైన ఐశ్వర్యమును, అపయశస్సును ఏ మాత్రము చేకూర్చలేదు. ఇదీ పల్లవుల ఘనమైన చరిత్ర. అంతేగాని వారు ఏనాడూ జీవనంకొరకు మత్స్యకారులుగా ఉన్నట్లు దాఖలాలు లేవు. ఆంధ్రదేశమంలో వారి పతనానంతరము పల్లవులలో పాలకవర్గము వారిలో కొందరు కాంచీపురం రాజధానిగా దక్షిణ భారతదేశ పాలకులుగా కొనసాగగా ఆంధ్రదేశంలోని సామాన్య ప్రజానీకము అప్పటి వారి వారి వృత్తులను అవలంబించి ఉండవచ్చును లేదా కొందరు చరిత్రకారులు విశ్లేషించినట్లు శత్రుదాడిని ఎదుర్కోలేక పాలకవర్గము వారు అప్పటి వారి స్వస్థానమునుండి పారిపోయి వారి ఉనికిని మరుగుపరచుకొనుటకు సముద్రతీరవాసులతో కలిసిపోయి వారి వృత్తిని చేపట్టివుండవచ్చు. పల్లవులను ఓడించిన చాళుక్యులు పల్లవుల సమూల నిర్మూలనే ధ్యేయంగా పోరాడినట్లు చరిత్ర వుంది.
అ.క్ష.ల ఏర్పాటు మెతక స్వభావులతో జరిగింది. (చూడు కరపత్రము-1). కనుక ఆ మెతకతనము వారిలో జీర్ణించుకుపోయి ఉదాసీనముగా వుంటారు. "పదాభితిష్త తపుషిమ్" - వేధించే వాడిని ఉక్కుపాదాలతో నలిపి పారేయి అనే ఋగ్వేద వాక్యమును మరిచిపోయి "మిత్రస్యాహం చక్షుషా సర్వాణి భూతాని సమీక్షే" - నేను సర్వప్రాణులను మిత్రదృష్టితో, ప్రేమభావంతో చూతునుగాక - అను యజుర్వేద వాక్యమును చక్కగా పాటిస్తారు. "మిత్రస్యమా చక్షుషా సర్వాణి భూతాని సమీక్షంతామ్" - సర్వప్రాణులు నన్ను మిత్రదృష్టితో చూచునుగాక! - అను యజుర్వేద వాక్యమును ఆశిస్తారు. అ.క్ష.లలో వ్యవసాయము, నౌకానిర్మాణము, నౌకాయానము, వడ్రంగము, కమ్మరము మొదలైన పనులలో నిష్ణాతులైన వారు ఇప్పటికీ ఎందరో ఉన్నారు. నౌకానిర్మాణము, నౌకాయానము అ.క్ష.లకే ప్రత్యేకము. కనుక అ.క్ష.లందరూ మత్స్యకారులు కాదు. మత్స్యకారులందరూ అ.క్ష.లు కాదు. అందువలన అ.క్ష.లు తమను తాము పల్లీలమని, పల్లెకారులమని, మత్స్యకారులమని చెప్పుకోవడం, అలా పిలిపించుకోవడం సరైనదికాదు. మత్స్యకారులుకాని అ.క్ష.లకు ఇది చాలా బాధాకరమైన విషయము. అందుకే వారు కులానికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నవి. కనుక అ.క్ష.లు తమది కులవృత్తి ఆధారిత కులం కాదని, తాత్కాలికంగా ఆ వృత్తిలోవున్నవారు అవకాశం దొరికినపుడు వేరే వృత్తులలోకి మారుచున్నారని, సమాజానికి చాటిచెప్పాలి. జీవనాధారంగా ఏ వృత్తిచేపట్టినా అ.క్ష.లను పేరుకు సార్థకత కలుగు విధంగా జీవించి, సమాజంలో మంచి గుర్తింపు పొందాలి. పూర్వవైభవమును పునరుద్ధరించుకోవాలి. దీనివల్ల కేవలము వారికి సమాజంలోగల హీనమైన గుర్తింపులో ఏ కొంచెమైనా మార్పు కలుగుతుందేమోగాని వారి ఆర్థిక పరిస్థితిలో, అక్షరాస్యతలో అకస్మాత్తుగా ఎటువంటి అభివృద్దికి ఆస్కారము లేదు. అందుకు ప్రత్యేకంగా కృషి జరగాలి.
ఏది సాధించాలన్నా సంఘటిత శక్తి అవసరము. అందుకు ఒక బలమైన సంఘమును ఏర్పాటు చేసి కేవలము అ.క్ష.ల ఆత్మగౌరవము పెంచి, న్యూనతభావమునుండి బయటకుతెచ్చి అగ్రకులాలతో సమానస్థాయికి పెంచాలనే ఒకే ఒక్క సంకల్పంతో కృషి చేయాలి. సంకల్పము బలంగావుంటే సాధన మార్గాలు వాటంతట అవే సమకూరుతాయి. ప్రస్తుతం సమాజాన్ని శాసిస్తున్న మన రాష్ట్రంలోని కొన్ని కులాలవారు క్రీ.శ.1880-1910 మధ్యకాలంలోనే శాశ్వతప్రాతిపదికన బలమైన కులసంఘాలను ఏర్పరచుకొని ఇప్పటికీ విజయవంతముగా నడుపుకొనుచుండుట చూస్తున్నాము. అ.క్ష.ల్ కొరకు 1901లో ఏర్పడిన కులసంఘము నిర్వీర్యంగా ఉంది. అందువలన అ.క్ష.లు సంఘటితమై ప్రస్తుతము నడుస్తున్న సంఘాలకు అతీతంగాగాని, సంయుక్తంగాగాని ఒక బలమైన సంఘాన్ని శాశ్వతప్రాతిపదికన ఏర్పరచుకోవాలి.
సంఘ నిర్మాణము గురించిన వివరములు వేరుగా అందించబడును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి